ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచీ ‘సాక్షి’కి ఒక రకమైన పూనకం వచ్చేసినట్టుంది! ఆయన ఢిల్లీలో ఏకాకి అయిపోయారూ, ఎవ్వరూ పట్టించుకోలేదూ అంటూ నిన్న, అసలు చంద్రబాబు టూరులో ప్రత్యేక హోదా ప్రస్థావనే లేదని ఈరోజు కథనాలు రాశారు. ఢిల్లీలో చంద్రబాబు టూరు గురించి జాతీయ మీడియా అంతా మాట్లాడుకుంటున్నా.. సాక్షికి మాత్రం కనిపించదు, వినిపించదు! వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలూ, చివరికి భాజపాకి చెందిన కొంతమంది సీనియర్లతో కూడా చంద్రబాబు కలిసి మాట్లాడటం చర్చనీయం అవుతున్నా… అబ్బే, ఆయన కేవలం ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యారని రాశారు. ఇక, జాతీయ మీడియాతో సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెడితే… దాన్లో ప్రత్యేక హోదా గురించి ప్రముఖంగా చంద్రబాబు మాట్లాడలేదని ఓ కథనం వండి వార్చారు.
ఢిల్లీలో ప్రెస్ మీట్ కి వీళ్లు వెళ్లలేదో, సీఎం ఇంగ్లిష్ లో మాట్లాడితే వీరికి అర్థం కాలేదో మరి. కేంద్రం నిర్లక్ష్యం వల్ల ఆంధ్రా ఎదుర్కొంటున్న సమస్యల్ని పూసగుచ్చినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. ఏపీ డిమాండ్లకు సంబంధించిన 18 అంశాలు మీడియా ముందుంచారు. రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు, పరిశ్రమలు, రాష్ట్ర తలసరి ఆదాయం, ప్రధాని ఇచ్చిన హాామీలు.. ఇలా ఒక్కో అంశం గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఇక, సాక్షికి కనిపించని, వినిపించని ‘ప్రత్యేక హోదా’ గురించి చాలా ప్రముఖంగా మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిందనీ, కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు హోదా పొడిగిస్తున్నారనీ, అలాంటప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో సమీక్షించాలనీ, విభజన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఒక కమిటీ వేసి రివ్యూ చేయలన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో ఏపీ ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదంతా ఏంటీ… ప్రత్యేక హోదా ప్రస్థావన కాదా..? ఆ ప్రెస్ మీట్ లో ఏపీకి జరిగిన అన్యాయం, కేంద్రం చేయాల్సిన న్యాయం గురించి తప్ప వేరే అంశం మాట్లాడలేదే..! మరి, సాక్షికి కనిపించిన ఆ సీక్రెట్ మిషన్ ఏంటీ..? పోనీ, అదైనా వారు బయటపెట్టాలి కదా..?
చంద్రబాబు ఢిల్లీ వచ్చేసరికి జాతీయ మీడియాతో సహా, ఫోకస్ అంతా ఆయనవైపు మళ్లింది. కేంద్రం చేసిన అన్యాయాన్ని అందరికీ వివరించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థలకి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో ఇప్పుడీ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయం అయింది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకునే స్థితిలో వైకాపా నేతలు లేరు. ఒక పత్రికగా విలువలే మా ట్యాగ్ లైన్ అని చెప్పుకునే ‘సాక్షి’ కూడా అదే తరహాలో.. చంద్రబాబు టూరు స్పందనను ప్రతిబింబించలేకపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే… ఢిల్లీలో వారు చేస్తున్నామనుకుంటున్న హోదా పోరాటానికి ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే ఆందోళనలో వైకాపా నేతలు ఉన్నారు. దానికి ప్రతిస్పందనే ‘సాక్షి’ కథనాలు. అందుకే, చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో ప్రత్యేక హోదా ప్రస్థావనని సాక్షి చూడలేకపోయింది, రాయలేకపోతోంది. ఏదో సీక్రెట్ మిషన్ అంటూ బురద జల్లుతున్నారే తప్ప.. దానిపై కూడా సమగ్ర ఇన్వెస్టిగేటివ్ కథనాలను సాక్షి ఇవ్వలేకపోతోంది.