ఎపీ ఎన్జీవో సంఘం నేత అశోక్ బాబుపై సాక్షి దినపత్రిక…. వారానికో కథనం ఉండేలా చూసుకుంటోంది. ఆయనపై పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకుడి ముద్ర వేయాలని తాపత్రయ పడుతోంది. ఆయన త్వరలోనే స్వచ్చంద పదవి విరమణ చేయబోతున్నారని… ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిపోతారని.. కుదరకపోతే.. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని… అటూ ఇటూ మార్చి ఇదే కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విడతల వారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో సారి అదే తరహాలో ఓ మాదిరి పెద్ద కథనాన్నే ప్రచారంలోకి తేవడం ఆసక్తి కరంగా మారింది. అశోక్‌బాబుకు చంద్రన్న కానుక ఇచ్చేశాడని తేల్చింది.
ఉద్యోగసంఘాల నేతగా అశోక్‌బాబు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటం ఆయనకు ముఖ్యం. ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తూ… వీలైనంతగా ఉద్యోగుల ప్రయోజనాలను ఆయన సాధిస్తున్నారు కూడా. కానీ సాక్షి లక్ష్యం వేరు… ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా… అశోక్ బాబు వ్యవహరించాలని కోరుకుంటోంది. ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రకటనలు చేయాలని ఆశ పడుతోంది. అలా చేస్తేనే ఆయన … ఎపీఎన్జీవో సంఘం నేతగా నిఖార్సుగా పని చేస్తున్నట్లు.. లేకపోతే.. టీడీపీలో చేరిపోతున్నట్లు సాక్షి పత్రిక ప్రచారం చేస్తోంది. నిజానికి తన రాజకీయ జీవితం గురించి…తాను ఉద్యోగ విరమణ చేసిన తరవాతే నిర్ణయం తీసుకుంటానని అశోక్ బాబు చాలా సార్లు ప్రకటించారు. స్వచ్చద పదవీ విరమణకు దరఖాస్తు చేశారని.. గతంలో వైసీపీ, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అలా దరఖాస్తు చేసినట్లు నిరూపిస్తే.. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కూడా. కానీ వైసీపీ, బీజేపీ నేతల లక్ష్యం వేరు కాబట్టి.. ఆయన టార్గెట్ గా కథనాలు ప్రచురిస్తూనే ఉన్నారు.
ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరగాలంటే.. ఎపీ ఎన్జీవో సంఘమే మంచి ఆయుధమని… వైసీపీ అగ్రనాయకత్వం ఆశ పడుతున్నట్లు ఉంది. అందుకే వీలైనంతగా… అశోక్ బాబుపై టీడీపీ అనుకూల ముద్ర వేసి బయటకు పంపేస్తే.. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే నేతలకు పగ్గాలు చేతికొచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే అశోక్ బాబు పదవి విరమణ లేకపోయినప్పటికీ… ఆయన తరవాత స్థానాల్లో ఉన్న వారిపైనా…. టీడీపీ అనుకూల ముద్ర వేస్తోంది. వారిని ఉద్యోగ సంఘాల యూనిట్లు వ్యతిరేకిస్తున్నట్లు సాక్షి పత్రిక ద్వారా ప్రచారం ప్రారంభించారు. వైసీపీకి అనుకూలంగా ఉండే ఎన్జీవో నేతకు పదవి దక్కే వరకూ అశోక్ బాబు అండ్ కో పై … సాక్షి ప్రచారం ఆగకపోవచ్చేమో..?