పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఒక ముతక సామెత. ప్రతిపక్ష నేత జగన్ కి చెందిన సాక్షి పత్రికకి కూడా ఇలాంటి సమస్యే ఉన్నట్టుంది..! ఏపీ నుంచి ఎవరు ఢిల్లీ వెళ్లినా అనుమానంగా చూడటం, ఏదో లాయింగ్ చేయడానికి వెళ్తున్నారేమో, కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నమేమో అని అనుమానించడం అలవాటైపోయింది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. రెండ్రోజులపాటు ఢిల్లీలో ఉండి.. ఏపీ ప్రయోజనాల అంశమై ఇతర పార్టీల మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. ఏపీ సమస్యలపై పోరాటాన్ని ఎలా చేస్తే బాగుంటుందనే అంశమే ఈ పర్యటనలో ప్రాధానమైంది.
ఈ నేపథ్యంలో సాక్షి పత్రిక ఓ కథనం వండి వార్చింది. బాబుగారి ఢిల్లీ యాత్ర.. సమ్ థింగ్ స్పెషల్ అంటూ ఓ ఊహాజనిత కథనం రాసింది. టూర్ నెంబర్ 30 షురూ అయిందంటూ ఎద్దేవా చేయడమే ఈ కథనం ముఖ్యోద్దేశం. ఎంపీల రాజీనామాలు చేయిస్తారా అని వైకాపా అడిగితే స్పందించరనీ, వైకాపా నేతలు చేయబోతున్న నిరాహార దీక్షలో భాగమౌతారా అంటే అదీ తేల్చరనీ.. అలాంటప్పుడు ఢిల్లీకి ఎందుకొస్తున్నట్టు అనే కోణాన్ని తీసుకుని కథనం అల్లేశారు. చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వెళ్లారంటే.. లాబీయింగ్ కోసమట! అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కేంద్రానికి చేరిపోయాయని చంద్రబాబు భయపడుతున్నారట. రేపోమాపో కేంద్రం విచారణకు ఆదేశిస్తుందేమోననీ, ఒకవేళ అదే జరిగితే తనకు మద్దతుగా నిలిచేందుకు చిన్నా చితకా పార్టీల సాయం కూడగట్టేందుకే ఆయన ఢిల్లీ వచ్చారన్నది సాక్షి కథనం సారాంశం.
ఢిల్లీ అనగానే వైకాపాకీ, ఆ పార్టీ పాంప్లెట్ కీ కేసులు మాత్రమే గుర్తుకొస్తాయి. ముందుగా కేసుల పేరుతో భుజాలు తడుముకునేది వారే..! ఢిల్లీ వేదికగా వైకాపా చేస్తున్నదే కేసుల రాజకీయం. రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే.. ఢిల్లీలో ఇన్నాళ్లుగా మకాం వేసిన ఎంపీలు ఏనాడైనా కేంద్రం తీరుపై విమర్శలు చేశారా..? ప్రతీ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి విజయసాయి రెడ్డి చేస్తున్నదేంటీ..? అయినా, బేసిక్ లాజిక్ మరచిపోయి ఇలాంటి కథనాలు రాస్తే ఎలా..? ఒకవేళ చంద్రబాబుకి కేసుల భయమే ఉంటే… భాజపాతో పొత్తు ఎందుకు వదులుకుంటారండీ..! ఆ భయం వైకాపాకి ఉంది కాబట్టి, లేని పొత్తును నెత్తినేసుకుని మరీ తెల్లారిన దగ్గర నుంచీ అమిత్ షా, మోడీల కరుణాకటాక్ష వీక్షణాల కోసం కాలుగాలిన పిల్లిలా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నది వైకాపా నేతలు కాదా..? సాక్షి చెబుతున్న మరో అర్థం లేని వాదన ఏంటంటే.. ఒకవేళ చంద్రబాబుపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశిస్తే.. ఇతర పార్టీలు ఏవైనా సరే ఏమైనా చెయ్యగలవా..? మద్దతుగా ఎలా నిలుస్తాయి..?
రాష్ట్ర ప్రయోజనాలు అనేవి వైకాపాకి ఒక పోరాటాంశం మాత్రమే. ఆ పోరాటంలో చిత్తశుద్ధి ఏపాటిదనే చర్చ పెడితే నేతి బీరలో నెయ్యి కోసం వెతికినట్టు అవుతుంది. కానీ, అధికార పార్టీగా టీడీపీకి అదొక బాధ్యత. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేసి తీరాల్సిందే. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయన నడవాల్సిందే. ఆ ప్రయత్నాల్లో భాగంగా వీలైతే ప్రతిపక్షాలు సీఎం వెంట రావాలి. అంతేగానీ.. మేం చేస్తున్న పోరాటానికి చంద్రబాబు మద్దతు ఇవ్వరూ, ఎంపీలు రాజీనామా గురించి మాట్లాడరూ, నిరాహార దీక్షలు చెయ్యరూ అంటూ వితండానికి దిగడం అవివేకం..! ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే, దాని వెనక ఇమిడి ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు సాక్షి హ్రస్వద్రుష్టికి కనిపించవు. వారికి కనిపించేవి, వినిపించేవి, అనిపించేవి.. కేసులు కేసులు కేసులు, ఇంతే.