రాజకీయ పొత్తుల్ని పెళ్లిళ్లతో పోల్చుతూ… వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను… మూడు రోజుల తర్వాత ప్రత్యేక కథనంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. అంత ఆలస్యం ఎందుకయిందో కానీ… పార్టీ నేతలతో చంద్రబాబు జరిపిన చర్చల్లో… పొత్తుల అంశం ప్రస్తావనకు వచ్చిందని… కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని చంద్రబాబు .. సమావేశంలో పార్టీ నేతలకు చెప్పినట్లు సాక్షి తేల్చింది. వచ్చే ఎన్నికల తర్వాత పోలవరం, ఓటుకు నోటు కేసులో ఇబ్బంది పడకుండా ఉండాలంటే… కాంగ్రెస్‌తో పొత్తు ఉండాల్సిందేనని చంద్రబాబు చెప్పారట. ఆ మేరకు ఓ కథనాన్ని బ్యానర్‌గా రాసేశారు.
సాక్షి కొద్ది రోజులుగా…. చంద్రబాబు పెళ్లితో ఎవరితో చేద్దామా అని డైలమాలో ఉంది. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో.. ఈడీ చార్జిషీట్ దాఖలు చేయగానే.. అందులో వైఎస్ భారతి పేరు ఉందనగానే… వైఎస్ జగన్ మొదట ఎత్తుకున్న వాదన…. చంద్రబాబు కుట్రేనని. దాన్ని సాక్షి పత్రిక … మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతానన్నట్లుగా ఫాలో అయింది. చంద్రబాబు ఏం చెబితే… బీజేపీ అది చేస్తోందనడానికి ఇదే నిదర్శనమంటూ… వాదన ప్రారంభించారు. దీనికి తిరుగులేని సాక్ష్యాలంటూ.. వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి రావడం, చంద్రబాబు వ్యక్తిగతంగా ఎప్పటికీ మిత్రుడేనంటూ రాజ్‌నాథ్ వ్యవహరించం, మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో చోటివ్వడం వంటి వాటిని చొప్పుకొస్తున్నారు.
అలా అని బీజేపీతోనే లింక్ పెట్టాలని సాక్షి అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీనీ చంద్రబాబు లెక్కలో వేయాలని తాపత్రయ పడుతోంది. కేసుల మాఫీ కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారంటూ… కొద్ది రోజుల నుంచి విచిత్రమైన వాదన తెరపైకి తీసుకువచ్చింది. ఈ రోజు రాసిన పెళ్లిళ్ల కథనంలోనూ అదే కారణంగా చూపిస్తున్నారు. కేసుల మాఫీ కోసం.. ఎవరైనా ప్రతిపక్ష పార్టీతో పొత్తులు పెట్టుకుంటారా..?. అలాంటివి ఏమైనా ఉంటే… కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే.. ప్రస్తుత అధికార పార్టీ ఊరుకుంటుందా..? ఈ చిన్న కామన్సెన్స్ సాక్షి ఎందుకు వినియోగించడం లేదో మరి…?.
మొత్తంగా చూస్తే సాక్షి పత్రిక కథనంలో .. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఎక్కడ పొత్తు పెట్టుకుంటారోనన్న ఆందోళన కనిపించింది. పొత్తు పెట్టకుండా ఆపడమో.. ఆ పొత్తుపై ప్రజల్లో… వ్యతిరేక భావం పెంచడమో చేయడమే లక్ష్యంగా సాక్షి … పొత్తులను పెళ్లిళ్లతో పోల్చుతూ… కథనాలు వండేస్తోంది. కానీ ఒక రోజు.. బీజేపీతో మరో రోజు… కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి సాక్షి పెళ్లి చేసేస్తోంది. ఎవరో ఒకరితో ముందు సాక్షినే ఫిక్సయితే.. ఆ తర్వాత ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయవచ్చు. కానీ సాక్షి మాత్రం ఏ రోజుది ఆ రోజే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.