ఒకరు చేయని వ్యాఖ్యల్ని… చేశారో లేదో స్పష్టత లేని వ్యాఖ్యల్ని… చేసి ఉంటారు అని చెప్పడాన్ని ఏ తరహా జర్నలిజం అంటారు అనేది సాక్షికి మాత్రమే తెలియాలి! ‘బాబు మనోడే’ అంటూ పార్టీ నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారని ఓ కథనం వండివార్చారు. పోనీ, అదేమన్నా మీడియా ముఖంగా చెప్పారా… రాహుల్ అలా అన్నట్టుగా సాక్షికి పక్కా సోర్స్ ఉందా.. అంటే, కథనంలో ఆ స్పష్టతా ఇవ్వలేకపోయారు..! ‘కాస్త అటుఇటుగా రాహుల్ గాంధీ ఇదే చెప్పి ఉంటార’నే ఊహాజనిత అభిప్రాయాన్ని పత్రికలో అచ్చేశారు. చంద్రబాబు నాయుడు ఏది చెబితే ఇకపై అదే కరెక్ట్ అనాలనీ, చంద్రబాబును విమర్శించడానికి ఓటుకు నోటు కేసును తెరాస తెర మీదికి తెస్తే… తెలంగాణ మంత్రులపై ఉన్న కేసుల్ని మనం ప్రస్థావించాలనీ, పొత్తు అపవిత్రమని భాజపా ఆరోపిస్తే ధీటుగా సమాధానం చెప్పాలని… కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ ‘కాస్త అటోఇటో’గా ఇదే చెప్పారని సాక్షి రాసింది.
అంతేకాదు.. ‘అయ్యో.. ఇప్పుడు టీడీపీని వెనకేసుని రావాల్సిన దురవస్థ వచ్చిందే, హతవిధీ..’ అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. అవి సాక్షికి మాత్రమే వినిపించాయట! చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీ మాత్రమే పూర్తయిందనీ, సైబర్ టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటివి రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తయ్యాయని ఓ కాంగ్రెస్ నేత (ఎవరో మరి?) అభిప్రాయరపడ్డారట! టీడీపీని ఆంధ్రా పార్టీ అని ఎవరైనా విమర్శిస్తే తిప్పికొట్టాలనీ, ఇకపై ఓటుకు నోటుకు కేసును కాంగ్రెస్ చూసుకుంటుందని భరోసా ఇచ్చారనీ… ఇలా ఆ కథనంలో చాలాచాలా రాశారు.
సాక్షి కంటికి ఎప్పుడూ కేసులూ రాజీలూ ఒప్పందాలూ మాత్రమే కనిపిస్తాయి! అది వాళ్లకు అలవాటైపోయిన దృష్టిలోపం. అదే కంటితో అందర్నీ వారు చూసుకున్నా ఫర్వాలేదు.. కానీ, ప్రజల్నీ చూడమంటే ఎలా..? ఈ కథనంలో జాగ్రత్తగా గమనిస్తే… చంద్రబాబు నాయుడుని వెనకేసుకుని వచ్చేందుకు రాహుల్ గాంధీ ఇంతగా తాపత్రయపడుతున్నారా అనిపిస్తుంది! అంటే, కాంగ్రెస్ కి టీడీపీతో అంత అవసరమా అనిపిస్తుంది. వాస్తవానికి, తెలంగాణలో మహా కూటమిలో భాగంగా కలిసి పనిచేయాల్సిన అవసరం టీడీపీకి ఉందా, కాంగ్రెస్ కి ఉందా..? టీడీపీ కలిసి రాకపోవడం వల్ల కాంగ్రెస్ కోల్పోయేది ఏమైనా ఉంటుందా..? ఎవరిది అప్పర్ హ్యాండ్…? అలాంటప్పుడు టీడీపీని ఇంతగా వెనకేసుకుని, చంద్రబాబుపై నేతల్లో తీవ్రమైన అసంతృప్తీ ఆగ్రహాలూ ఉన్నా కూడా వాటిని అణుచుకుని పని చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉంటుంది..? తెలంగాణలో టీడీపీ అండలేకపోతే గెలవలేమనే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా..? లేదు కదా! ఒకవేళ టీడీపీకి అంత పట్టు ఉందనుకుంటే… ఓ పాతిక స్థానాల కోసం ఎందుకు పాకులాడుతారు..? సొంతంగా అన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థుల్ని ఎందుకు నిలబెట్టరు..? ఈ చిన్న లాజిక్ ప్రజలు ఆలోచించరని సాక్షి ఎందుకు అనుకుంటుంది..?
ఇక, ‘విశ్వసనీయత’ అనే ట్యాగ్ లైన్ పెట్టుకుని ప్రతీరోజూ జగన్ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. రాజకీయ వ్యవస్థ మొత్తంలోకి విశ్వసనీయత రావాలంటారు. అదేదో ముందుగా సాక్షిలో వచ్చేట్టు చేస్తే… రాజకీయ వ్యవస్థ సంగతి తరువాత చూడొచ్చు. ‘కాస్త అటో ఇటో… ఇందులో మార్పులు ఉండొచ్చుగానీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు రాహుల్ చేసిన హితోపదేశ సారాంశం’ అని రాయడంలోనే విశ్వసనీయత పోయింది! ఒక నాయకుడు చెప్పారో లేదో తెలియని అభిప్రాయాన్ని… వారు చెప్పాలనుకుంటున్నదానికి అనుగుణంగా మార్చేసి ప్రచురించడాన్ని ఏ తరహా విశ్వసనీయత అంటారో..?