తమ మద్దతుదారులు, తమ పార్టీకి ఓటేస్తారని అనుమానం ఉన్నవారి ఓటు హక్కులు గల్లంతైపోతున్నాయంటూ వైకాపా ప్రచారం మొదలుపెట్టేసింది. వైకాపా అభిమానుల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ బరితెగిస్తోందనీ, తెలుగుదేశం పార్టీవారి ఇళ్లలో కూర్చుని ఓటర్ల జాబితాలో మార్పులూ చేర్పులూ చేస్తున్నారంటూ సాక్షి పత్రిక ఓ కథనం రాసింది. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలు, జన్మభూమి కమిటీల మెంబర్లు, రెవెన్యూ అధికారులు కలిసి ఓటర్ లిస్టులను మార్చేస్తున్నారని వాపోయింది. తాము ఓడిపోతామన్న భయంతోనే తెలుగుదేశం ఇప్పట్నుంచే ఇలా వ్యవహరిస్తోందని పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో ఏం చేసైనా గెలిచి తీరాలన్న అధికార దాహంతో లక్షల కొద్దీ ఓట్లను మాయం చేస్తున్నారంటూ ఆరోపించింది. మరణించినవారు, స్థానికంగా నివాసం ఉండనివారు, అడ్రస్ లో నివాసం ఉండదని ఓటర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించామని అధికారులు చెబుతున్నా… ఇదంతా తెలుగుదేశం నాయకుల ఒత్తిళ్ల మేరకు జరుగుతున్నాయంటూ సాక్షి తీర్మానించేసింది..!
నిజానికి, ప్రతీ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు లేవనెత్తే ఒక రొటీన్ విమర్శల్లో ఇదీ ఒకటే. ఆ మధ్య గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో తెరాసపై తీవ్ర విమర్శలు చేసింది. తమ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితాలు మార్చేస్తున్నారంటూ వాపోయింది. అయితే, మనదేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియ, మార్పులూ చేర్పులూ ప్రక్రియ అనేది అత్యంత సంక్లిష్టమైంది. ప్రతీ ఎన్నికల ముందూ సవరణలు తప్పవు. దాన్లో పొరపాట్లు అనేవి అత్యంత సహజం. కుక్కలకీ కోళ్లకీ ఆధార్ కార్డులు జారీ అవుతున్న వైనం చూస్తున్న క్రమంలో.. ఓటర్ల జాబితాలో తప్పులు ఉండకుండా ఉంటాయని చెప్పలేం. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రతీసారీ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎన్నికలు ముగియగానే మళ్లీ ఈ టాపిక్ ఎవ్వరూ పట్టించుకోరు.
ఇక, వైకాపా చేస్తున్న ఆరోపణల విషయానికొస్తే… ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీపై మరో నాలుగు రాళ్లేయడం తప్ప, వాళ్లు ఆశిస్తున్న ప్రయోజనం మరొకటి కనిపించడం లేదు. ఓటర్ల జాబితాలో మార్పులూ చేర్పులూ అనేవి ఎన్నికల ముందు జరుగుతాయి. ఒకవేళ వైకాపా ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని మార్చేస్తున్నారన్న అనుమానం వస్తే… ఆ పార్టీ నాయకులే రంగంలోకి దిగొచ్చు. ఓటర్ల జాబితాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి కదా. ఒకవేళ అర్హులైనవారికి ఓటు హక్కు లేకపోయినా, ఉన్నవారిని జాబితా నుంచి తొలగించినా.. వెంటనే నమోదు చేసుకోవచ్చు. కొత్తవారిని నమోదు చేసుకునే క్రమంలో కూడా.. ‘ఈ దరఖాస్తుదారుడు వైకాపా అభిమాని కాబట్టి ఓటు హక్కు ఇవ్వం’ అంటూ నిరాకరించే పరిస్థితి ఉండదు కదా. అంతేకాదు, టీడీపీ నేతల ప్రోత్సాహంతోనే ఇన్ని లక్షల ఓట్లు జాబితాల నుంచి మాయమయ్యాయన్న అంశంపై న్యాయపోరాటానికి కూడా వెళ్లొచ్చు.
రాజ్యాంగ ప్రకారం ప్రతీ పౌరుడికీ దక్కే ఓటు హక్కును హరించే అధికారం ఎవ్వరికీ లేదు. అది కచ్చితంగా క్షమించరాని నేరమే. అయితే, దీన్ని కేవలం ఒక విమర్శనాస్త్రంగా మాత్రమే కాకుండా, ఇదే అంశంతో టీడీపీపై పోరాటం చేస్తే ఇతరులకు కూడా వైకాపా ఆదర్శప్రాయం అవుతుంది కదా. తమ ఓట్లు పోయాయీ పోయాయీ అనే బదులు, అర్హులైన వారి ఓట్లు పోతున్నాయన్న యాంగిల్ లో వైకాపా ఆందోళన చెందితే… దానిలో రాజకీయ కోణం కాస్తైనా తక్కువగా కనిపిస్తుంది.