మాట్లాడితే మీనింగ్ ఉంటాలంటారు. కానీ.. సాక్షి రాతలకు మాత్రం అది ఎప్పటికీ ఉండదు. మోకాలికీ, బోడి గుండుకూ లింకు పెట్టడం సాక్షి స్టైల్. అది అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరోసారి నిరూపితమైంది. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ పై రావడం, ఆ తరవాత జరిగిన హంగామా – ఇవన్నీ మెగా కుటుంబానికో లేదంటే ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వానికో వ్యతిరేకంగా ఎలా వాడుకోవాలో తెలీక మల్లగుల్లాలు పడుతోంది. రోజుకో చెత్త వార్త రాస్తూ – అభాసుపాలు అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ ఎదుగుదల చూసి ఓర్వలేకనే అనే హెడ్డింగుతో ఓ కథనం వండి వార్చేసింది.
అల్లు అర్జున్ అరెస్ట్‌కు, ఆ తరవాత జరుగుతున్న హంగామాకూ కారణం ఏపీలోని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులే కారణం, వాళ్ల హస్తం ఉందంటూ ఓ భూటకపు వార్త రాసేసింది. నంధ్యాల ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్లడంతోనే ఈ వైరం మొదలైందని, పుష్ప లాంటి హిట్ పడడం, బన్నీకి కొత్త ఇమేజ్ రావడం చూసి తట్టుకోలేకపోయారని.. ఏవేవో కట్టు కథల్ని అల్లేసింది సాక్షి.
తెలంగాణలో సంధ్య ధియేటర్ ఘటనకూ ఆంధ్రా ప్రభుత్వానికీ ఏమైనా సంబంధం ఉందా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా ఇస్తే, తీసుకొనే స్థాయిలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? అసలు జరిగిందేమిటి, జరుగుతోందేమిటి? దానికీ నంధ్యాలలో ఎన్నికల ప్రచారానికి బన్నీ వెళ్లడానికి లింక్ ఏమిటి? ఈ వార్తని రాసిన పాత్రికేయుడుకి కానీ, ప్రచురించిన ఎడిటర్ కి కానీ కనీస అవగాహన ఉందా?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచీ ఏదో తేడా జరుగుతోందని సాక్షి రాసింది. పుష్ప 2 విషయంలో నిర్మాతలు అడిగినంత రేట్లు ఇవ్వడం ఏపీ ప్రభుత్వం చేసిన తప్పా? నిజంగా బన్నీని తొక్కేయాలని ఉంటే స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇస్తారా? బన్నీ ఇమేజ్ చూసి మెగా హీరోలు ఫ్యాంటులు తడిపేసుకొంటున్నారనుకొంటే – బన్నీ విడులయ్యాక స్వయంగా చిరంజీవి, నాగబాబుని కలవడానికి వెళ్తాడా? బన్నీ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే చిరంజీవి బన్నీ ఇంటికి హుటాహుటిన వెళ్తాడా? ఇవన్నీ సాక్షి కి పట్టవా? కనిపించవా? కనిపించినా కనిపించనట్టు నటిస్తుందా?
బన్నీ జీవితంలో అనుకోని ఘటన జరిగింది. అందులోంచి ఎలా బయటపడాలో తెలీక సతమతమవుతున్నాడు బన్నీ. జరిగిన ఘటన వల్ల ఓ కుటుంబం బాగా నష్టపోయింది. వీటి మధ్య సాక్షి పేలాలు ఏరుకోవాలనుకొంటోంది. ఇంతకంటే దారుణం, దుర్మార్గం మరోటి ఉంటుందా? నోటికొచ్చింది రాసి, అడ్డమైన ధమ్లైన్స్ పెట్టే సీ గ్రేడ్ యూ ట్యూబ్ ఛానల్ కీ, సాక్షికి ఏం తేడా కనిపించడం లేదిప్పుడు.