“రాష్ట్రంలో రాజకీయాలు చేసుకుందాం.. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలు వచ్చే సరికి కలసి పోరాడదాం…” ఇదీ ప్రాంతీయ పార్టీలు.. రాజ్యం చేసే రాష్ట్రాల్లో ఆచరించే ఓ అప్రకటిత రాజకీయ విధానం. తమిళనాడులో ఇదే జరుగుతుంది. కానీ ఏపీలో ఏం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రానికి అన్యాయం చేయమని… ఓ పార్టీ పొత్సహిస్తున్న రీతిలో వ్యవహారాలు నడుస్తున్నాయి. దాని కోసం అడ్డగోలు సమర్థనలకూ ఏ మాత్రం సంకోచించడం లేదు. ఏపీ ప్రభుత్వం… నాలుగున్నరేళ్ల పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచుతోంది. ఇందులో తప్పులుంటే… ప్రతిపక్షం లేదా.. బీజేపీ పట్టుకుని.. ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ… బీజేపీ నీళ్లు నములుతోంది. ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడటం లేదు. కానీ వైసీపీ మాత్రం బ్లాక్ పేపర్లు రిలీజ్ చేస్తామని ఉత్సాహ పడింది. ఈ రోజు నుంచి సాక్షి పత్రికలో విశ్లేషణలు ప్రారంభించారు. మొదటి శ్వేతపత్రంపై విశ్లేషణ ఇచ్చారు. అందులో.. ఎక్కడా… కేంద్రం ఇవ్వాల్సిన విభజన హామీలపై బీజేపీని ఒక్క ప్రశ్న వేయకపోగా.. వాళ్లది అంతా ఒప్పేనన్నట్లుగా చెప్పుకొచ్చారు. అడ్డగోలుగా సమర్థించారు.
ప్రత్యేకహోదా సాధ్యం కాదంటేనే.. పేరు లేకపోయినా ఆ ప్రయోజనాలకు చంద్రబాబు ఒప్పుకున్నారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత ఆ హోదా పేరుతో.. రాజకీయ నాటకాన్ని వైసీపీ, జనసేనలను అడ్డం పెట్టుకుని ప్రారంభించడం.. ప్యాకేజీ కింద నిధులు ఏమీ ఇవ్వకపోవడంతో… చంద్రబాబు మళ్లీ ప్రత్యేకహోదా నినాదం అందుకున్నారు. అయితే.. చంద్రబాబు ప్యాకేజీ కావాలన్నారన్నట్లుగా.. సాక్షి పత్రిక రాసుకొచ్చింది. శ్వేతపత్రంలో దీనికి సంబంధం లేకపోయినా విశ్లేషణ పేరుతో రాజకీయ విమర్శలు చేసుకొచ్చి.. అసత్యాలు చెప్పుకొచ్చారు. బీజేపీకి ఇంతగా ప్రత్యేకహోదా విషయంలో అండగా నిలబడల్సిన అవసరం సాక్షికి ఎందుకొచ్చింది..?. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ.. అదే తరహా విశ్లేషణ. భూసేకరణ చట్టం ప్రకారం చూస్తేనే అంచనాలు పెరిగాయని పిల్లవాడికి కూడా తెలుసు. దానిపైనా బీజేపీని సమర్థించుకుని వచ్చింది సాక్షి.
ఇక వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని.. నీతిఆయోగ్ స్పష్టం చేసింది. యూసీలు సక్రంగా ఉన్నాయని చెప్పింది. నిధులు విడుదల చేయాలని ప్రత్యేకంగా కేంద్రానికి సూచించింది. అయినా విడుదల చేయలేదు. అయినప్పటికీ.. కేంద్రం.. ఎక్కడా బహిరంగంగా… ఎందుకు నిధులు విడుదల చేయలేదో చెప్పకపోయినా… బీజేపీ వాయిస్‌ను సాక్షి తన గొంతుగా వినిపించే ప్రయత్నం చేసింది. పోర్టు, రైల్వేజోన్, స్టీల్ ఫ్యాక్టరీ వంటి అన్ని అంశాల్లోనూ బీజేపీని వెనకేసుకొచ్చింది సాక్షి బ్లాక్ పేపర్. ఒక్కటంటే ఒక్కచోటా.. ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్న మాత్రం వినిపించలేదు. రైల్వేజోన్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయని కొత్త వాదన తీసుకొచ్చింది. టీడీపీ ఎంపీలు చెబితే పెడతారా..? విభజన చట్టం ప్రకారం పెట్టమంటున్నారా..? అనే ప్రశ్న చదివే పాఠకుడి వస్తుందన్న ఆలోచన కూడా.. సాక్షి ఎడిటోరియల్ సిబ్బందికి రాలేదు. అమరావతికి నిధులు ఇవ్వకపోవడానికి… ఏపీ నుంచి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పోకపోవడమే కారణమని.. కొత్త కారణం చెప్పారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా డీటైల్డ్ రిపోర్టులు పంపినట్లు ఆధారాలు కూడా రిలీజ్ చేసింది. విద్యాసంస్థలకు నిధులు తక్కువ విడుదల చేయడంలోనూ కేంద్రం తప్పేమీ లేదట.
పరిస్థితి చూస్తూంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే… ఆ పార్టీ తప్పేమీ లేదన్నట్లుగా.. సాక్షి గ్రౌండ్ సిద్దం చేసుకోవడానికి ఈ తరహా బ్లాక్ పేపర్లు … రిలీజ్ చేస్తోందేమోనన్న అభిప్రాయం పాఠకుల్లో వ్యక్తమైతే.. అది వారి తప్పు కాదు.. సాక్షి, వైసీపీ తప్పే..!