వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని చెప్పడానికి ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్షా అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి. అంతా కుటుంబం అని.. కుటుంబ సభ్యులను ఎందుకు చంపుకుంటామని సీఎం జగన్ వాదన. అంత వరకూ బాగానే ఉంది కానీ ఇప్పుడు వివేకా క్యారెక్టర్‌పైనా.. ఆయన కుమార్తె, అల్లుడిపైనా నిందలు వేయడానికి వైసీపీ మీడియా చేస్తున్న ప్రయత్నాలు అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నాయి.
గతంలో ప్రత్యేక కథనాలు రాసిన సాక్షి పత్రిక ఇప్పుడు అరెస్టయిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య పేరుతో హైకోర్టులో ఓ పిటిషన్ వేయించి అందులో ఏముందో సమగ్రంగా వివరించారు. అది సరిపోదేమో అనుకున్నారు కానీ ప్రత్యేకంగా ఆ ఆ పిటిషన్‌ను క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి స్కాన్ చేసి చదువుకోమని పాఠకులకు సలహా కూడా ఇచ్చారు. గతంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడి పేరుతో సీబీఐకి ఇదే ఆరోపణలతో లేఖ రాశారు. ఇప్పుడు భార్య పేరుతో పిటిషన్ దాఖలు చేశారు.
తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ పోరాడి సీబీఐ విచారణ తెచ్చుకున్న సునీతపైనే ఇప్పుడు ఆరోపణలు చేస్తూ దాడి చేయడం ఇక్కడ అసలు ట్విస్ట్. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు తుడిచేసి.. పోస్టుమార్టం కూడా లేకుండా అంత్యక్రియలు జరిపించేసే ప్లాన్ అమలు చేసిన వారు సాక్షికి నిజాయితీపరులు.. నీతి మంతులుగా కనిపిస్తున్నారు. హంతకులు ఎవరో తేలాలని పట్టుబట్టిన వారే హంతకులుగా కనిపిస్తున్నారు. ఇందులో అసలు విషాదం ఏమిటంటే చనిపోయింది జగన్ సొంత బాబాయి… పోరాడుతోంది.. ఆయన చెల్లి. కానీ ఇక్కడ సాక్షి మాత్రం భిన్నమైన కథనాలు రాస్తోంది. సీఎం బాబాయి క్యారెక్టర్‌పై తప్పుడు ముద్ర వేసి.. ఆయన కుమార్తె, అల్లుడిపైనే నిందలేస్తోంది. అసలు విలువలే ఉండవనడానికి ఇదే నిదర్శనంగా మారింది.