ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను ఈసీ నిర్వహించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగిన రోజు నుంచీ ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరాటం మొదలుపెట్టారు. అయితే, ఆయన చేస్తున్న విమర్శల్ని కేవలం ఓటమి భయం నుంచి తప్పించుకునేందుకు వెతుకుతున్న సాకుగానే వైకాపా నేతలు తిప్పికొడుతూ వచ్చారు. ఎన్నికలు జరిగిన తీరుపైగానీ, గంటలకొద్దీ బారుల్లో నిలబడ్డ ప్రజల కష్టాలనుగానీ, ఈవీఎంల మొరాయింపులనుగానీ వారు పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికల సంఘాన్ని ఎవరైనా విమర్శిస్తే, వారికంటే ముందుగానే వైకాపా నేతలు స్పందిచేస్తున్నారు! ఎన్నికల ఏర్పాట్లు అధ్వాన్నం అని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తే, అద్భుతమంటూ విజయసాయిరెడ్డి లేఖ రాస్తారు. అయితే, ఇవాళ్టి సాక్షి పత్రికలో… గత కొద్దిరోజులుగా వైకాపా వినిపిస్తున్న వాణీ బాణీకి కాస్త భిన్నంగా ఓ కథనం కనిపించింది!
నిర్లక్ష్యమా… పెద్దల డైరెక్షనా?… అనే శీర్షికతో ఇవాళ్టి సాక్షిలో ఒక కథనం అచ్చైంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో పోలింగ్ ఆలస్యం కావడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. అయితే, కథనం ఎత్తుకోవడమే… 2014 కంటే తాజాగా జరిగిన ఎన్నికలను ఈసీ సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ… అంటూ మొదలుపెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనకున్న శక్తులపై ఈసీ దృష్టి పెట్టిందన్నారు. దీంతో విస్తుపోయే నిజాలు బయటకి వస్తున్నాయనీ, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఇందుకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు రాశారు. 13 జిల్లాల కలెక్టర్ల నుంచి దివ్వేదీ నివేదిక కోరడం, బెంగళూరు నుంచి వచ్చిన నిపుణులను వినియోగించుకోకపోవడం… ఇలా నిన్న ద్వివేదీ దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ రాశారు.
ఈసీ మీద ఈగ వాలితే, తమ మీద దుడ్డు పడ్డట్టు సాక్షి వ్యవహరించేది. ఎన్నికల జరిగిన తీరు అద్భుతః అని కీర్తిస్తూ వచ్చింది. హైటెక్ సీఎం అని చెప్పుకునే చంద్రబాబు, ఈవీఎంలు వద్దంటున్నారంటూ ఎద్దేవా చేసింది. గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారానే కదా గెలిచారంటూ పాయింట్లు లాగింది. కానీ, ఇవాళ్టి పత్రిక చూస్తుంటే.. కాస్త స్వరం మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈసీది తప్పులేదుగానీ… అధికారులది తప్పు ఉన్నట్టు ప్రాథమికంగా నిరూపణ అయిందట! కొనసాగుతున్న తప్పుడు ప్రచారం నేపథ్యంలో ఈసీ స్పందించింది అని రాశారు! అంటే, ప్రచారం తప్పుడుది అనుకుంటే… ఎందుకు స్పందించారు..? సరే, స్పందించారు. తప్పుడు ప్రచారంపై దృష్టి సారిస్తే… వాస్తవాలు బయటకి వస్తున్నాయని వారే రాశారు. అంటే, ఆ ప్రచారం తప్పుడుది కాదని ఒప్పుకుంటున్నట్టా..? ఎందుకీ ముసుగులో గుద్దులాట..? ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఈసీ ఫెయిలైందని నేరుగా ఎందుకు విమర్శించలేకపోతున్నారు..? సీఈవో వేరు, ఎన్నికలు నిర్వహించిన అధికారులు వేరు అన్నట్టుగా విభజన తీసుకొచ్చే ప్రయత్నం సాక్షికి ఎందుకు..? మారుతున్న సాక్షి గొంతును… ఎన్నికల్లో ఓటమికి సాకులు వెతుక్కుంటున్న ప్రయత్నంలో ప్రాథమిక దశగా అనుకోవచ్చా?