సాక్షి పత్రిక ఎడిటర్నీ మార్చేస్తున్నారు. ఇప్పటి వరకూ వర్దెల్లి మురళీ ఎడిటర్ గా ఉన్నారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి మనిషి. సాక్షి పత్రిక పెట్టినప్పటి నుండి మురళీది సాక్షిలో కీలక పాత్ర. మొదట్లో ఎడిటర్ గా పతంజలి ఉన్నప్పటికీ ఆయన పత్రిక స్ట్రాటజీల్ని పట్టించుకోరు. మురళీనే చూసుకునేవారు. ఆయన చనిపోయిన తర్వాత మురళీనే అధికారికంగా ఎడిటర్ అయ్యారు. కమ్యూనిస్టు నేపధ్యం ఉన్న నల్లగొండకు చెందిన జర్నలిస్టు అయిన వర్దెల్లి మురళీ సజ్జలకు నమ్మిన బంటు కావడంతో ఎదిగారు.
ఇప్పుడు ఆయనను తప్పించేందుకు నిర్ణయించారు. అయితే వాడుకుని వదిలేశారన్న పేరు రాకుండా ఆయనకు గతంలో రామచంద్రమూర్తికి ఇచ్చినట్లుగా ఎడిటోరియల్ డైరక్టర్ అనే పోస్టును కట్టబెట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఆ పోస్టులో ఉండి అప్పుడప్పుడూ జగన్ కు భ జన చేసుకుంటూ… టీడీపీని తిట్టుకుంటూ కాలమ్స్ రాస్తే సరిపోతుంది.త వర్దెల్లి మురళీ స్థానంలో ధనుంజయ్ రెడ్డి అనే మాజీ సలహాదారుడికి ఎడిటర్ బాధ్యతలు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఈ ధనుంజయ్ రెడ్డి ఈనాడుక్యాంపస్ లో పుట్టిన జర్నలిస్టే. అయితే సాక్షిలోనే ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రెసిడెంట్ ఎడిటర్ గా చేశారు. అయితే ఆయనపై చాలా ఆరోపణలు రావడంతో పత్రిక నుంచి పక్కన పెట్టి… సలహాదారు పదవి ఇచ్చారు. ఇప్పుడు నేరుగా ఎడిటర్ని చేస్తున్నారు. సాక్షిలో ఏమైనా జరగవచ్చని సెటైర్లు అక్కడి కాంపౌండ్ లో వినిపిస్తున్నాయి.