ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి న్యూస్ ఛానల్ ప్రసారాలని నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ డైరెక్టర్ కే.రామచంద్ర మూర్తి హైకోర్టులో వేసిన పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మౌకిక ఆదేశాల మేరకే పోలీస్ అధికారులు ఎం.ఎస్.ఓ.లపై ఒత్తిడి తెచ్చి సాక్షి ప్రసారాలని నిలిపివేశారని సాక్షి తరపున వాదించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పారు. ఏ కారణం చూపకుండానే ఆవిధంగా మౌకిక ఆదేశాలతో సాక్షి ప్రసరాలని నిలిపివేయడం సంబంధిత చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణని జూన్ 21కి వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా విషయాలలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ విధానాలని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహరంలో కూడా ఆయన విధానాన్నే అనుసరిస్తున్నట్లుంది. అయితే ఆ వ్యవహారంలో ఆయన తీసుకొన్న ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వలన న్యాయస్థానంలో ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణాలో రెండు ప్రముఖ న్యూస్ ఛానల్స్ పై నిషేధం విధించినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ తనకి, తన ప్రభుత్వానికి ఆ వ్యవహారం అసలు సంబంధమే లేదన్నట్లుగా మాట్లాడుతూ జాగ్రత్త పడ్డారు. అది ఎం.ఎస్.ఓ.లు సదరు చానల్స్ యాజమాన్యాలకి సంబంధించిన సమస్య అన్నట్లుగా మాట్లాడేవారు. అందుకే కేంద్రప్రభుత్వం, న్యాయస్థానాలు కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఆంధ్రా హోం మంత్రి చిన రాజప్ప స్వయంగా తమ ప్రభుత్వమే సాక్షి ప్రసారాలని నిలిపివేయించిందని మీడియా సమావేశంలో చెప్పడంతో ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా ఆ పని చేసిందని ప్రకటించినట్లయింది. ఒక న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిపివేయాలనుకొంటే ఆ పని చట్ట ప్రకారం చేసి ఉండి ఉంటే ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించగలిగేవారు కాదు. కానీ ప్రభుత్వం నిబంధనలని పట్టించుకోకుండా సాక్షి ప్రసారాలని నిలిపివేసినట్లు మంత్రి చిన రాజప్ప చేసిన ప్రకటన ద్రువీకరిస్తోంది. కనుక సాక్షి పునరుద్దరించమని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశం కల్పిస్తోంది. అదే జరిగితే ప్రతిపక్షాల ముందు రాష్ట్ర ప్రభుత్వం తలదించుకోక తప్పదు.