కళ్ల ముందు కనిపిస్తున్న నిజాన్ని కూడా నాటకంగా.. చెప్పి.. ప్రజల్ని నమ్మించాలని ఎవరైనా ప్రయత్నం చేసే వారికి ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయో లేవో కానీ… ఏపీలో …మాత్రం.. అలాంటి వాటికి “సాక్షి మార్క్..” అని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పోలవరంలో గిన్నిస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు జరిగాయి. దీన్ని ప్రపంచం మొత్తం చూసింది. ప్రత్యక్షంగా… కాంక్రీట్ వర్క్‌ను చూసిన గిన్నిస్ ప్రతినిధులు రికార్డు కూడా ఇచ్చారు. ఇది పత్రమే కావొచ్చు.. కానీ ప్రత్యక్షంగా… జరిగిన కాంక్రీట్ వర్క్‌ను కూడా గుర్తించలేనంత వ్యతిరేకత సాక్షి చూపిస్తోంది. “పోలవరం వేదికపై గిన్నిస్ రికార్డు నాటకం” అంటూ కథనం రాసేసింది. ఈ కథనం చదవుతూంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా.. ఏపీకి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తి కాకూడదనే ఆలోచన సాక్షికి ఉన్నట్లుందనే అనుమానం వస్తే.. ఆ తప్పు చదవే వాళ్లది కాదు.. సాక్షిదే.
శీర్షిక గిన్నిస్ రికార్డు నాటకం అని పెట్టినా.. ఏ విధంగా అది నాటకమో… లోపల కథనంలో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పలేదు. పోలవరం పనులు ఎంత వేగంంగా జరుగుతున్నాయో చెప్పలేదు. కాంక్రీట్ వర్క్ ప్రాధాన్యం ఏమిటో చెప్పలేదు. కానీ ఆ కథనం మొత్తం పోలవరంపై నరనరాన జీర్ణించుకున్న వ్యతిరేకతను మాత్రం బయటపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ కు ఏదో నిధుల సమస్య ఉన్నట్లు.. నిధుల సమస్యతో పనులేమీ సాగనట్లు పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను నిర్మించడంపై వ్యతిరేకత చూపెట్టారు. నాలుగున్నరేళ్ల అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి గిన్నిస్ రికార్డును వాడుకుంటున్నారంటూ.. కడుపు మంటను బయటపెట్టుకున్నారు. ప్రభుత్వంపై ఏదైనా అవినీతి ముద్ర ఉంటే.. అది.. పోలవరం కాంక్రీట్ వర్క్‌తో పోతుందా..?. ఇంత జరిగినా పోలవరం పనులేమీ జరగడం లేదని… చెప్పడానికి ఈ కథనంలోనే తాపత్రయ పడటం.. ఎవర్ని మోసం చేయడానికి..?
పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు రివ్యూలు చేయడం కూడా సాక్షికి తప్పులానే కనిపిస్తోంది. అలాగే.. గేట్ల బిగింపు ప్రక్రియ, గ్యాలరీ వాక్, కాంక్రీట్ వర్క్.. ఇలాంటివన్నీ… సాక్షికి మైలురాళ్లుగా కనిపించడం లేదు. ఆదో డ్రామా అన్నట్లు తేల్చేస్తోంది. కళ్లముందు జరుగుతున్న పనలను కూడా గుర్తించలేని దారుణమైన వ్యతిరేకతను పోలవరంపై.. సాక్షి మీడియా ప్రదర్శిస్తోందని తాజా కథనంతో నిరూపితమయింది. పత్రికలకే రాజకీయ ఎజెండా ఉండవచ్చేమో … రాజకీయ ఎజెండాతోనే పత్రిక నడిపితే.. సాక్షిలాగే.. ఉంటుందేమో..?