ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఇడుపులపాయలో ప్రారంభించిన ఈ యాత్ర దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. జగన్ యాత్రను వైకాపా పత్రిక ‘సాక్షి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. యాత్ర ప్రారంభించిన దగ్గర్నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించడమే జగన్ ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. దాంతోపాటు, ప్రతీరోజూ ఒక్కో కొత్త హామీలు ఇస్తూ కొన్నాళ్లు యాత్ర సాగించారు. వాటికే సాక్షి ప్రాధాన్యత ఇచ్చింది. నవరత్నాల హామీలు అంటూ కొన్నాళ్లు హడావుడి చేసి, దాన్నీ పక్కన పడేశారు. ఆ తరువాత, చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారు. అటుపై… టీడీపీ సర్కారుమీద అవినీతి ఆరోపణలు, కొన్నాళ్లు ప్రత్యేక హోదా… ఇలా పాదయాత్ర దారిపొడవునా జగన్ చెప్పినవే చెప్తూ వచ్చారు, దానికి అనుగుణంగా సాక్షి కవరేజ్ ఉంటూ వచ్చింది. పాదయాత్ర చివరి దశకు చేరుకుంటున్న సందర్భంలో… జగన్ వ్యాఖ్యలు కన్నా ప్రజల స్పందన మీదే సాక్షి ఫోకస్ ఎక్కువైంది.
జగన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారనీ.. ఈ యాంగిల్ లోనే ఈ మధ్య కథనాలుంటాయి. అయితే, ఒక్కోసారి ఈ తరహా కథనాల్లో మరీ అతి అనిపించేలా ఉంటున్నవీ కనిపిస్తున్నాయి. ఆదివారం పత్రికలో అలాంటివే సాక్షిలో కనిపించాయి. ‘ఉప్పొంగిన జనాభిమానం’ అంటూ ప్రచురించిన ఓ కథనంలో… జగన్ ఓ కుర్రాడికి అరచేతిలో ఆటోగ్రాఫ్ ఇస్తే, దాన్ని ఫొటో తీసి వాట్సాప్ లో పంపిస్తే, అది ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులకు చేరిపోయి వైరల్ అయిపోయిందన్న రేంజిలో రాశారు! జగన్ ఆటోగ్రాఫ్ తీసుకున్న కుర్రాడు సంతోషిస్తాడు.. అంతవరకూ ఓకే! ఆ తరువాతిది కాస్త అతి అనిపిస్తోంది. ఇంకోటి… మరో అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇస్తే… ‘ఇది కాబోయే సీఎం ఆటోగ్రాఫ్’ అంటూ పట్టరాని సంతోషంతో ఆ అమ్మాయి చెప్పిందన్నారు. ‘…ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే కష్టాలు తీరుతాయి’ అంటూ దారిపొడవునా ప్రజల స్పందన అని ఓ చోట పేర్కొన్నారు. ఇలాంటి మరికొన్ని రాశారు.
అయితే, ఇవి ప్రజల్లో ఉండవు అని చెప్పట్లేదు. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్తే… సామాన్యుల్లో ఇలాంటి ఆనందాలు కొన్ని ఉంటాయి. కానీ, ఇక్కడ సాక్షి కథనాల్లో తాపత్రయమే చర్చనీయం. జగన్ ముఖ్యమంత్రి అయిపోతున్నారని జనం నమ్మేశారని అంతర్లీనంగా తీర్మానించేశారనడమే ఈ కథనాల ఉద్దేశం. వాస్తవానికి, ఇలాంటి సందర్భాలు తాత్కాలిక భావోద్వేగాలను మాత్రమే ప్రభావితం చేస్తాయి. అంతేగానీ… వీటిని చదివినవారి ఆలోచనధోరణిని ప్రభావితం చెయ్యలేవు! సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు జగన్ నాయకత్వం ఎందుకు కావాలి..? జగన్ మాత్రమే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి..? జగన్ అయితే ఇప్పుడు కష్టసాధ్యమౌతున్నవి ఆయనెలా సాధించగలరు..? ఆ సాధ్యాసాధ్యాలేంటి… ఈ విజన్ ప్రజలకు సాక్షి ఇవ్వాలి.
ఒక సగటు వైకాపా కార్యకర్తకీ, ఆ పార్టీ పత్రిక స్పందనకూ తేడా లేకపోతే ఎలా..? జగన్ రాకవల్ల ఆనందాలు, సంతోషాలు, సంబరాలు ఇవి కార్యకర్తలకి వదిలెయ్యాలి! ప్రజలను ఆలోచింపజేసే విధంగా పత్రిక బాధ్యత ఉండాలి. కానీ, ఆ తరహా బరువైన కవరేజ్ జగన్ పాదయాత్ర మొదలైన దగ్గర్నుంచీ సాక్షి ఇవ్వలేకపోయిందనే అసంతృప్తి కొంతమందిలో కచ్చితంగా ఉంది. జగన్ యాత్ర చివరి దశకు చేరుకుంది కాబట్టి… యాత్ర పూర్తయ్యే సరికి ‘జగనే ముఖ్యమంత్రి’ అని జనాలు తీర్మానించేశారూ అని చాటి చెప్పడమే ప్రస్తుత సాక్షి వైఖరి అన్నట్టుగా కనిపిస్తోంది.