పొగడరా అంటే.. “మా ఊరి మిరియాలు తాటికాయలంత…” అనే వాళ్లు ఉంటారో లేదో కానీ .. మా సారు “ఉదయిస్తున్న సూర్యుడని” నొక్కి వక్కాణించడానికి చేయి తిరిగిన రచయితలు సాక్షిలో చాలా మంది ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ రచయితలకు తీరిక ఉండటం లేదు. ఓ ఫోటోను చూసి…లేదా ఓ జనసమూహాన్ని.. లేకపోతే జగనన్న పెడుతున్న ఓ ముద్దును చూసి … మనసును స్పందింపచేసుకుని “హృదయ విదారకమైన” కథనాలు రాయడంలో వారు పండిపోయారు.
పాదయాత్ర ప్రారంభించినప్పుడు… జగనన్నను చూసే దాకా అన్నం తిననిని.. స్కూలుకు వెళ్లనని… మారాం చేసిన ఐదేళ్ల బిడ్డ అభిమానాన్ని …”అజ్ఞానపీఠ” అవార్డ్ ఇవ్వగలిగే స్థాయిలో ఆవిష్కరించిన సాక్షి రచయితలు.. ఆ పరంపరను అలా కొనసాగిస్తూనే ఉన్నారు. మధ్యమధ్యలో… లోకం తెలియని పిల్లలు రాసిన లేఖలు వారి చేతుల్లోనూ ఆవిష్కృతమవుతున్నాయి.
రాను రాను.. ఈ రచయితలు.. తమ క్రియేటివిటీకి మరింత పదును పెడుతున్నారు. రోజుకు ఒక్కటైనా… పిలిచి .. దండేసి.. దండం పెట్టేసుకోవాలన్నంత కసితో కూడిన ఆనందాన్ని రచయితలు పాఠకులకు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఓ రెండు ఫోటో రైటప్లలో రచయితలు మరీ … ఆకాశమే హద్దు అన్నంతగా చెలరేగిపోవడంతో .. ఆన్లైన్లో వైరల్ అయిపోయాయి. పిల్లలకు గొడుగు పట్టుకున్న ఓ తల్లి ఫోటో వేసి… ” గొడుగు పట్టుకుని మరీ..” అనే టైటిల్ పెట్టారు. చదివే పాఠకులంతా”… ఏం చేసింది..? ఏం చేసింది…?” అని ఉగ్గబట్టుకుని ఆపకుండా చదివేంత టెంపో ఆ రచనలో ఉంది. జగన్‌ని చూడాలని పిల్లలు మారాం చేయడంతో గొడుగేసుకుని మరీ ఆ పిల్లలను తల్లిదండ్రులు తీసుకొచ్చారట. గొడుగే ఎందుకు వేసుకు రావాలనే డౌట్ రావొచ్చు.. అందుకే చినుకులు పడుతున్నాయని తెలివిగా కవరింగ్ ఇచ్చారు. కానీ ఆ ఫోటోలో అశేషజనవాహినిలో ఓ భాగం కాదు కదా.. వాళ్లు తప్ప.. ఒక్కరు కూడా కనిపించడం లేదు. అయితే.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఫోటో ఫ్రేమ్‌లో పట్టనంత జనం ఉన్నారు. కానీ వాళ్లు నిజంగా జగనన్నను తనివి తీరా చూడాలని వచ్చినోళ్లే… అది మాత్రం నిజం.. ఒట్టు..!
బస్సు కిటికి నుంచి బయటకు తల బయటకు పెట్టి చూస్తున్న ఓ యువకుడి వేదనను… మరింత హృద్యంగా వర్ణించిన మరో ఫోటో రైటప్ ఇప్పుడు… ఆన్లైన్లో వైరల్. ఫోన్లో పాటలు వింటూ.. ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయిందబ్బా.. అని ఉత్కంఠగా చూస్తున్న అతని మొహంలో.. వెలిగిపోతున్న సూర్యుడిలి కదలి వస్తున్న జగనన్నను చూసిన ఆనందం తాండవించేలా చేయగలిగారు. శిలలపై శిల్పాలు చెక్కినారు అని ఆచార్య ఆత్రేయ అంటే… శిల్పాలపై శిలలు కాక.. ఇంకేమీ చెక్కుతారని ఎవరూ అడగలేదు. ఆ స్థాయిలోనే సాక్షి రచయితలు ఎదిగిపోయారు. “… ఇదేమిటి వెటకారమా…నిజమా..” అని అడగాల్సిన అవసరం లేకుండా.. రాసేస్తున్నారు. వీటిని చూసి సాక్షి పాఠకుల కళ్ల వెంట… నీటి బొట్లు జలజలా రాలుతున్నాయి. అవి ఆనందభాష్పాలు కాదు.. నిజమైన కన్నీళ్లే.