జర్నలిజంలో సాక్షి కొత్త పుంతలు తొక్కుతోంది. సాధారణంగా ఏదైనా ఒక సభ జరిగినప్పుడు దానికి ముఖ్య అతిథిగా ఎవరైనా హాజరైనప్పుడు ఆ వార్తను ప్రెసెంట్ చేస్తే ఆ ముఖ్య అతిథి ఫోటోను ప్రచురిస్తూ వార్త వేస్తారు. లేదూ, తమకు నచ్చలేదంటే పూర్తిగా ఆ వార్తను ప్రచురించకుండా వదిలేస్తారు. అయితే గత రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ ఫోటో వేయకుండా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి చందంగా వ్యవహరిస్తున్న సాక్షి ఇవాళ మరొకసారి అదే తప్పు పునరావృతం చేసింది. వివరాల్లోకి వెళితే..
నిన్న తెలకపల్లి రవి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. మన సినిమాలు, అనుభవాలు, చరిత్ర పరిణామం అన్న పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సినిమాల ద్వారా ఎంతో చరిత్రను కూడా చెప్పవచ్చని, ఉయ్యాలవాడ వంటి ఎందరో గొప్ప వ్యక్తుల జీవితాలను ఆవిష్కరించవచ్చు అని పవన్ కళ్యాణ్ ఆ సభలో మాట్లాడారు. అయితే ఇవాల్టి సినిమా పేజీలో ఈ వార్తను ప్రచురించిన సాక్షి, ఆ ఫోటో ప్రచురించినప్పుడు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఫోటో తన పత్రికలో రాకుండా జాగ్రత్త పడింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎటువంటి కవరేజ్ ఇవ్వకుండా మిగతా వార్త మాత్రం ప్రచురించింది. సినిమా పేజీలో సైతం ఈ స్థాయిలో రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఉద్దేశ్యాలు బహిర్గతం చేసుకోవడం సాక్షికి పరిపాటిగా మారింది.
వార్తాపత్రికని, రాజకీయ పార్టీ కరపత్రిక స్థాయికి సాక్షి దిగజార్చి వేసిందని వివిధ వర్గాల ప్రజల నుండి వస్తున్న విమర్శలను సైతం సాక్షి ఏమాత్రం లెక్క చేయకపోవడం గమనార్హం.