రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది..! తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు తీరని ద్రోహం ఏదో చేసేసింది..! చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ముఖ్యమంత్రి ఏదో అయిపోతున్నారు..! ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో తీరని అన్యాయం చేసేశారు..! ఇవాళ్టి సాక్షి పత్రిక చూస్తే… కథనాలన్నింటిలోనూ ఇదే తరహా ఆవేదన, ఆందోళన, అనుమానాలు ధ్వనిస్తున్నాయి. ఆ ‘ఏదో’ ఏంటనేది సాక్షి చెప్పలేకపోతోంది. ఐటీ గ్రిడ్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ వేయడం కూడా సాక్షికి ఏదో తీవ్రమైన చర్యగా కనిపిస్తుంది. రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు నేరాలు చేస్తున్నారని గవర్నర్ కి జగన్ ఫిర్యాదు చేయడాన్ని గొప్ప చర్యగా రాస్తారు! మరి, ఈ రెండేళ్లూ ఫిర్యాదు చెయ్యకుండా జగన్ ఎందుకు కళ్లుమూసుకుని ఉన్నారో తెలీదు! డాటా చౌర్యం బయటపడటంతో చంద్రబాబు నాయుడుకి ఒణుకు పుట్టేసిందంటూ ఇంకో కథనం! ఇదే సందర్భంలో డీజీపీ మీద కూడా ఆరోపణలు చేస్తూ మరికొన్ని కథనాలు.
రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టుగా సాక్షి పత్రిక తీరు ఉంటోంది! అయితే, ఈ క్రమంలో ఒక పత్రికగా పాఠకులకు స్పష్టత ఇవ్వడంలో సాక్షి ఎప్పటిలాగానే ఇప్పుడూ విఫలమే అవుతోంది. ప్రజల వ్యక్తిగత సమాచారాలు బయటకి వెళ్లిపోవడం వల్ల… అది ఎన్నికలపై ప్రభావితం చూపుతాయంటూ కథనాలు రాశారు. ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఎక్కడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. డాటా బయటకి వచ్చేయడం వల్ల ఎక్కడైనా ఏదైనా నష్టం జరిగిందా..? ప్రస్తుతానికి లేకపోయినా, సమీప భవిష్యత్తులో జరిగే నష్టమేంటి..? ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలతో రాజకీయ పార్టీ ఏం చెయ్యగలదు..? ఏ రకంగా ప్రజలను ఇబ్బందిపెడుతుంది..? ప్రజలకు నేరుగా జరిగే నష్టమేంటి..? సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, ఆధార్ కార్డు నంబర్లు లాంటివి దగ్గరపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెయ్యగలదు..?
ఒక సిమ్ కార్డు కొనుగోలు చేస్తేనే ఆధార్ నంబర్ తీసుకుంటున్నారే, ముక్కూమొహం తెలియని కంపెనీల నుంచి ఆఫర్లంటూ ఫోన్లు చేసేవారికి మన ఫోన్ నంబర్లు తెలిసుంటాయే… ఆ లెక్కన ఎన్ని రకాల ప్రైవేటు కంపెనీల దగ్గర ప్రజల వ్యక్తిగత వివరాలు ఉన్నట్టు లెక్క! దానికీ, దీనికీ ఉన్న తేడా ఏంటి..? గడచిన మూడు రోజులుగా వైకాపా నేతల తీరు చూస్తున్న చాలామంది సామాన్యులకు కలుగుతున్న అనుమానాలు ఇవి. డాటా చౌర్యం అంటూ తెలంగాణ ప్రభుత్వంతోపాటు, వైకాపా నేతలు చేస్తున్న హడావుడి నేపథ్యంలో… ఈ ప్రశ్నలకు సాక్షి సమాధానాలు చెప్పి ఉంటే, ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేది. ఆ ప్రయత్నం లేకుండా.. ఏదో జరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది..?