ఒక పార్టీ పత్రికగా ఇప్పటికీ తన బాధ్యతను సాక్షి పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోతోంది. వైకాపా అధ్యక్షుడు జగన్ ఏం చెబితే అది రాయడమే తప్ప… జగన్ కు సూచించే స్థాయిలో ఏనాడూ ఆ పత్రిక వ్యవహరించలేదు. జగన్ వెనక నడవడమే తప్ప… జగన్ ను నడిపించే దిశగా, మార్గదర్శకంగా వ్యవహరించడం లేదు. జగన్ వ్యూహాల్లో లోపాలను విశ్లేషించడం లేదు. పార్టీకి దిశానిర్దేశం చేసే పాత్రను ఇప్పటికీ భుజానికి ఎత్తుకోవడం లేదు. ఇవాళ్లి సాక్షి పత్రికలో… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన పింఛెన్ల పెంపు నిర్ణయంపై గొంతు చించుకుంది. ‘వైయస్ నవరాత్నాల ఎఫెక్ట్… పింఛెన్ పెంపు’ అంటూ టీడీపీ సర్కారు నిర్ణయంలో జగన్ సాధించిన విజయాలను వెతుక్కునే విఫలయత్నం చేసింది.
ఎన్నికల్లో ఓటమి తప్పదేమో అనే భయంతోనే ఇప్పటికిప్పుడు పెన్షన్లను చంద్రబాబు నాయుడు పెంచారంటూ ఆ కథనంలో పేర్కొంది. ఇది ఏడాదిన్నర క్రితమే జగన్ ఇచ్చిన హామీ అనీ, దాన్ని ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తున్నారనీ, నవరత్నాల హామీల్లో భాగంగా జగన్ చెప్పింది ఏంటి అంటూ వివరిస్తూ రాసుకొచ్చారు. ఈ కథనం ఎలా ఉందంటే… ‘మేము చెయ్యాలనుకున్నది మీరెందుకు చేశారు, ఎలా చేస్తారు, చేసే హక్కు ఎక్కడుందీ’ అంటూ అర్థరహితంగా ప్రశ్నించినట్టుగా ఉంది. ఇక్కడ సాక్షి గుర్తించలేని పాఠకుడి కోణం ఏంటంటే… ‘జగన్ ఇచ్చింది కేవలం హామీ మాత్రమే, ప్రభుత్వ నిర్ణయం అమలౌతుంది కదా… ఈ రెంటినీ సాక్షి ఒకేలా ఎందుకు చూస్తోందీ’ అని! అంటే, జగన్ హామీలు ఇచ్చిన అంశాలపై ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకూడదన్నట్టుగా ఉంది సాక్షి ధోరణి. కేవలం అధికార సాధనే ధ్యేయంగా ఉన్నప్పుడే ఈ తరహా మైండ్ సెట్ వస్తుంది. సమస్యలుండాలి, ఆ సమస్యలను జగన్ మాత్రమే తీర్చాలి, జగన్ వచ్చే వచ్చేవరకూ సమస్యల్లో ఉన్నవారు కూడా నిస్సహాయంగా ఎదురుచూస్తూ ఉండాలి… ఇదే సాక్షి ఇంజెక్ట్ చేస్తున్న కాన్సెప్ట్.
అసలు సమస్య ఎక్కడుందనేది సాక్షి విశ్లేషించదు. వాస్తవానికి వైకాపా రాజకీయ వ్యూహాల్లోనే సమస్య ఉంది. ఎన్నికలకు రెండేళ్ల ముందే జగన్ ప్రచారం ప్రారంభించడమే వైకాపా వ్యూహాత్మక లోపం! ఎప్పుడో 2017 జూలై 8న నవరత్నాలు ప్రకటించేసి, తాను భవిష్యత్తులో… అంటే, ఎప్పుడో 2019లో ముఖ్యమంత్రి అవుతానూ, అప్పుడు వాటిని అమలుచేస్తాను అని ముందుగా ప్రకటించేయడం వ్యూహాత్మక తప్పిదం. ప్రతిపక్ష పార్టీ ఇచ్చే హామీలేంటో ముందుగా తెలిసిపోతే… అధికారంలో ఉన్న పార్టీ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా..? విపక్షం లేవనెత్తిన సమస్యల్లో జెన్యూన్ గా ఉన్నవి పరిష్కరించేస్తుంది. అసలు లోపం ఇక్కడుంది. దీన్ని వైకాపా పత్రికగా సాక్షి ఏనాడూ అడ్రస్ చెయ్యదు, చెయ్యలేదు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మరికొన్ని కీలక నిర్ణయాలను రాబోయే రోజుల్లో చంద్రబాబు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా ఇలాగే సాక్షి గుండెలు బాదేసుకుంటుంది. మేమిచ్చిన హామీలనే చంద్రబాబు అమలు చేస్తున్నారు అని రాస్తూ కూర్చుంటే ఏం ఉపయోగం..?
ప్రజల సమస్యలను తమకు కలిసొచ్చే అంశాలుగా వైకాపా చూస్తోంది, సమస్యలను పరిష్కరించే కోణంలో టీడీపీ ఆలోచిస్తోంది. వైకాపా ద్రుష్టిలో సమస్య అంటే తమ ఖాతాలో పడే కొన్ని ఓట్ల శాతం… జగన్ ను ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేసే ఓ అవకాశం. ప్రజా సమస్యలపై నిజమైన సానుభూతి జగన్ ఉంటే.. ఈరోజున సాక్షి ఇలా స్పందించేది కాదు.ప్రతిపక్షంగా వైకాపా వైఫల్యానికి సాక్షి ఆవేదన అద్దం పడుతోంది.