ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడే వరకూ సాక్షి పే రోల్స్‌లో ఉన్న ఎనిమిది మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు.. ప్రభుత్వ సలహాదారుల పేరుతో జీతాలు చెల్లిస్తున్నారు. ఈ జీతాలు కూడా.. లక్షల్లో ఉండటం… అదే స్థాయిలో అలవెన్స్‌లు కూడా మంజూరు చేయడం..విమర్శలకు కారణం అవుతోంది. ఇప్పటికి ఎనిమిది మందిని ఇలా తీసుకున్నారని.. మరికొంత మందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొన్నటి సాక్షి ఉద్యోగులే .. నేటి సలహాదారులు..!
సజ్జల రామకృష్ణారెడ్డి …
ప్రజాసంబంధాల సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. తర్వాత పూర్తిగా వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అయినప్పటికీ..ఆయనకు సాక్షి నుంచి జీతం అందేది. ఇప్పుడు ఏపీ సర్కార్ సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈయన జీతం రూ. మూడు లక్షలకుపైనే. ఎనిమిది మంది వరకూ సిబ్బందిని నియమించునే అవకాశం…కారు.. ఫోన్.. ఇల్లు ఇలా అన్ని రకాల అలవెన్సులు కలిపి.. నెలకు రూ. పది లక్షలకుపైగానే ప్రభుత్వం నుంచి వసూలు చేస్తున్నారు.
జీవీడీ కృష్ణమోహన్..!
జగన్ సీఎం అయిన వెంటనే.. జీవీడీ కృష్ణమోహన్ అనే సాక్షి ఉద్యోగిని.. కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించారు. నిజానికి ఈయన సాక్షి ఉద్యోగే కానీ… జగన్మోహన్ రెడ్డి స్పీచ్‌లు రాయడమే ఈయన పని. సాక్షి కోసం ఎప్పుడూ పని చేసింది లేదు. అయినా సాక్షి తరపునే జీతం ఇచ్చేవారు. అది కూడా.. నెలకు రూ. లక్ష లోపే. ఇప్పుడు.. ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. ఆ భారం ఎందుకనుకున్నారేమో … నేరుగా కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించేశారు. ఆయన జీత భత్యాలు… సిబ్బంది ఖర్చు.. కూడా నెలకు రూ. పది లక్షలకు చేరుకున్నాయి.
పూడి శ్రీహరి..!
సీపీఆర్వోగా… పూడి శ్రీహరి అనే సాక్షి ఉద్యోగిని నియమించుకున్నారు. సాక్షిలో.. రూ. యాభై వేలలోపే జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అసాంతం.. ఆయన వెంట ఉన్నారు. మీడియా వ్యవహారాలు చూసుకున్నారు. ఓ పుస్తకం కూడా రాసి.. జగన్ ను మెప్పించడంతో.. సీపీఆర్వోగా నియమించేశారు. ఈయన జీతం కూడా.. సీనియర్ సలహాదారుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. ఇక అలవెన్సులు… తక్కువ కాదు. ఈయనకు ఎనిమిది మంది టీం.. కారు.. ఇల్లు… ఫోన్.. ఇలా అనేక సౌకర్యాల అలవెన్సులు…ఎక్స్ట్రా..! అన్నీ కలిపి నెలకు.. రూ. పది లక్షల దగ్గర చేరుతున్నాయి.
రూ. లక్షలు జీతం తీసుకుంటున్న వారు ఏ పని చేస్తున్నారు..?
వీరు మాత్రమే కాదు.. సాక్షి పేరోల్స్‌లో.. కాస్త ఎక్కువ జీతం అనుకున్న మరో ఐదు మందికి.. ఇదే తరహాలో.. సలహాదారుల పోస్టులు ఇచ్చి.. ప్రభుత్వ ఖాతా నుంచి జీతాలిస్తున్నారని.. ఐ అండ్ పీఆర్లో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో.. ఇలా నియమించుకుంటున్న సలహాదారులకు.. కావాల్సిన సిబ్బంది కూడా.. సాక్షి గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులేనన్న చర్చ నడుస్తోంది. ఈ సలహాదారులు.. వారి సిబ్బంది ఏ పని చేస్తున్నారో… ప్రభుత్వంలో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభుత్వం తరపున జీతాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది సాక్షిలో విధులు నిర్వహిస్తున్నారని కూడా అంటున్నారు.
సాక్షి జీతాలు ప్రజాధనంతో చెల్లించేస్తున్నారా..?
సాక్షి పత్రిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయం.. మీడియాలో ఉన్న అందరికీ తెలుసు. ఆ పత్రిక.. గత నాలుగైదేళ్ల కాలంలో.. ఉద్యోగులకు.. ఇవ్వాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లను.. తొక్కి పెట్టింది. నాలుగేళ్ల పాటు.. ఒక్క రూపాయి జీతం కూడా… ఉద్యోగులకు పెంచలేదు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే… సంతృప్తి పరిచేలా.. ఇంక్రిమెంట్, బోనస్ ఇస్తామని.. చెబుతూ వచ్చారు. అయితే వైసీపీ గెలిచినప్పటికీ.. సాక్షి ఉద్యోగులకు.. చెప్పినట్లుగా ఇంక్రిమెంట్ వేయలేదు. కేవలం ఆరు శాతం ఇంక్రిమెంట్.. ఒక్క నెల బోనస్ మాత్రమే ఇచ్చారు. దాంతో.. ఉద్యోగులు అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో వైసీపీ విజయం కోసం.. ఇంత కాలం పని చేసిన ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులు, సీనియర్లను సంతృప్తి పరచడానికి ప్రభుత్వ జీతాలతో.. నియామకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి జీతాల భారాన్ని ఆ విధంగా తగ్గించారా..?
సాక్షిలో మ్యాన్ పవర్ అత్యధికంగా ఉంటుంది. అక్కడ ఉన్న ఉద్యోగుల వ్యవస్థ కారణంగా.. ఉద్యోగులను కుదించలేని పరిస్థితి సాక్షికి ఉంది. నెల నెల జీతాల బిల్లు భారంగా మారుతోందన్న అభిప్రాయం సాక్షి యాజమాన్యంలో ఉంది. ఉన్నత స్థాయిలో రూ. లక్షకుపైగా జీతం తీసుకునే ఉద్యోగులు.. కనీసం వంద మంది ఉంటారని చెబుతారు. డైరక్టర్లు.. ఆ తర్వాత స్థాయి వారిలో… ఏడాదికి రూ. యాభై లక్షలు డ్రా చేసేవారు కూడా ఉన్నారు. వీరందరి భారాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్న ఆరోపణలు.. తాజా నియామకాల ద్వారా వినిపిస్తున్నాయి.
పొదుపు గురించి సీఎం చెప్పిన మాటలేమయ్యాయి..?
ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని… తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి.. ఇలా సలహాదారులు.. వారి సహాయకుల కోసం.. నెలకు.. కోట్లకు కోట్లు జీతభత్యాలు వెచ్చించడ.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. నిజంగా ప్రభుత్వానికి అవసరం అయి తీసుకుంటే… పర్వాలేదు కానీ.. సాక్షిలో జీతాలు తీసుకునేవారిని.. తన పార్టీ కోసం పని చేసిన వారిని… ఇలా నియమిస్తూండటంతో.. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.