ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది! అయితే, గత సమావేశాల్లో 13 సార్లు తాము నోటీసులు ఇచ్చినా, స్పీకర్ చర్చకు అంగీకరించలేదనీ, తమ ఎంపీలు రాజీనామాలు చేసిన తరువాత చర్చ జరుగుతుండటం భాజపా-టీడీపీల లాలూచీ రాజకీయమనే ప్రచారాన్నే వైకాపా ఎత్తుకుంది..! అయితే, పార్లమెంటులో జరుగుతున్న చర్చ ఆంధ్రా ప్రజల ప్రయోజనాలకు సంబంధించిందే అనే కన్సెర్న్ వైకాపాకి ఉందా లేదా అనేది వేరే చర్చ. ఎంపీల రాజీనామాలు చేయడంతో ప్రస్తుత సమావేశాలకు వైకాపా దూరమైంది. కానీ, పార్లమెంటులో జరుగుతున్న చర్చతో తమకూ సంబంధం ఉందనే విషయాన్ని ఎస్టాబ్లిస్ చేసుకోవడానికి ఆ పార్టీ మీడియా సాక్షి తమవంతు ప్రయత్నం చేస్తోంది.
దీన్లో భాగంగా పార్లమెంటులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగంలో ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యల్ని వెతికిపట్టుకునే ప్రయత్నం చేసింది సాక్షి. గతంలో ఆంధ్రా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయాలనే.. లోకసభలో నేటి జయదేవ్ ప్రసంగంలో ఉన్నాయంటూ ఓ కనెక్టివిటీ స్టోరీని తయారు చేశారు. 2015, సెప్టెంబర్ 5న అసెంబ్లీలో జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ… ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం నో చెప్పిందనీ, అందుకే కేంద్రం ఇవ్వడం లేదని చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. 14వ ఆర్థిక సంఘంలో సభ్యుడు అభిజిత్ సేన్, మరో సభ్యుడు గోవిందరావులు చాలా సందర్భాల్లో ప్రత్యేక హోదా రద్దును సిఫార్సు చేయలేదని చెప్పారని గుర్తు చేశారు. ఇక, గురువారం పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చెప్పలేదంటూ అవే అంశాలను ప్రస్థావించారు.
ఇక్కడ రెండు విషయాలున్నాయి.. మొదటిది, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పింది అనేది జగన్మోహన్ రెడ్డి కనిపెట్టిన అంశం కాదు! అది ఎవరు మాట్లాడినా… జగన్ మాటే అని సాక్షి క్లెయిమ్ చేసుకోవడం విడ్డూరం! ఇక, రెండోది… 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో హోదా ఇవ్వొద్దని ఎక్కడా చెప్పకపోయినా, దాన్ని సీఎం చంద్రబాబు వదిలేశారు అనేది నాటి జగన్ మాటల అంతరార్థం, నేడు సాక్షి గుర్తు చేయాలనుకుంటున్నదీ అదే! అయితే, ఏపీకి ఇవ్వాల్సిన హోదా అంశాన్ని దాటవేయడం కోసం కేంద్రం వినిపించిన కట్టుకథల్లో ఇదీ ఒకటి! కానీ, హోదాకి సమానమైన ప్రయోజనాలను.. భాజపా పరిభాషలో చెప్పాలంటే, అంతకుమించిన ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రాకి ఇస్తామంటూ సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండేళ్ల కిందట ప్రకటించారు.
ఆ సందర్భంలో కేంద్రానికి రాష్ట్రం ధన్యవాదాలు తెలిపింది. ప్రయోజనాలు కల్పిస్తామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్రానికీ ప్రధానికీ ధన్యవాదాలు తెలపడం అనేది కనీస ధర్మం. అయితే, అలా ప్రకటించినవేవీ కేంద్రం నెరవేర్చలేదు కాబట్టే.. ఇవాళ్ల పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. అయితే, సమయంలో పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీగా అస్త్ర సన్యాసం చేసేశారు. ఇంకా చెప్పుకోవడానికి వారి దగ్గరేం లేదు.. చేయడానికి విమర్శలు తప్ప. ఇప్పుడు, ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంలో జగన్ మాటలే ఉన్నాయంటూ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు!