సొంత పార్టీ స్థాపించినప్పటి నుంచీ కూడా జగన్ నోటి వెంట వచ్చే ఒక రొటీన్ డైలాగ్ ‘నేనే సిఎం’. అప్పట్లో 2014లో నేనే సిఎం అని చెప్పేవాడు. ఆ ఛాన్స్ చంద్రబాబు కొట్టేశాడు కాబట్టి ఇప్పుడిక 2019లో నేనే సిఎం అని కొత్తగా మొదలెట్టాడు. జిందాతిలిస్మాత్ లాగా ప్రజలు ఎదుర్కుంటున్న అన్ని సమస్యలకు జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడమే పరిష్కారం అన్నది వైకాపా జనాల గట్టి అభిప్రాయం. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే జగన్ తీరుకు ఇప్పటికే ఆయనకు ఎన్నో ప్రశంశలు దక్కి ఉండాల్సింది. నిజానికి ప్రజలతో ఎక్కువ సమయం వెచ్చించిన నాయకుల లిస్టు తీస్తే అందులో కచ్చితంగా జగన్ నంబర్ ఒన్ స్థానంలో ఉంటాడు. ఆ రకంగా ఆయనకు మంచి పేరు వచ్చి ఉండాల్సింది. కానీ ఎక్కడకు వెళ్ళినా ‘నేనే సిఎం’ అన్న డైలాగ్ వినిపిస్తూ ఉంటూ ఉండడంతో….అంతా కూడా పదవి కోసమే చేస్తున్నాడన్న అపవాదునే మూటగట్టుకుంటున్నాడు. ఇంత చిన్న లాజిక్‌ని జగన్ ఎందుకు మిస్సవుత్తున్నాడో తెలియదు.
ఇప్పుడిక ఈ ‘నేనే సిఎం’ డైలాగ్ జగన్ మీడియా సాక్షికి కూడా నచ్చుతున్నట్టుగా లేదు. మామూలుగా అయితే జగన్ ఎక్కడికి వెళ్ళినా…ఏం మాట్లాడినా…అక్షరం పొల్లుపోకుండా అన్నీ ప్రచురించే సాక్షి..ఇప్పుడు జగన్ నోటి వెంట వస్తున్న ‘నేనే సిఎం’ డైలాగ్‌ని ప్రచురించడం మానేసింది. నిన్న పులివెందుల జనాలతో సమావేశమైన జగన్…ఆ ప్రజలు ఎధుర్కుంటున్న సమస్యలను విన్నాడు. ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న సందర్భంలోనే రెండేళ్ళలో నేనే సిఎం అని మరోసారి అదే ఓల్డ్ సాంగ్ వినిపించాడు. ఈ రోజు సాక్షి పేపర్లో జగన్ మాట్లాడిన అన్ని మాటలనూ ప్రచురించారు కానీ ఆ ‘నేనే సిఎం’ డైలాగ్‌ని మాత్రం వదిలేశారు. మరి ఇప్పటికైనా వైఎస్ జగన్ తన తీరు మార్చుకుంటాడేమో చూడాలి.