ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటితో 3000 కిలో మీటర్ల మైలురాయి దాటనుంది. విజయనగరం జిల్లాలో భారీ బహిరంగ సభలో ఇవాళ్ల జగన్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పత్రిక కొన్ని ప్రత్యేక కథనాలు ప్రచురించింది. జగన్ సాగిస్తున్న ఈ పాదయాత్ర వల్ల ఆయన జనం గుండెల్లోకి వెళ్లారనీ, ప్రతీ పేదవాడి మనస్సాక్షి ‘జగన్ ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటోందనీ, ఇలాంటి వ్యక్తికి అధికారం ఇవ్వాలని జనాలు ఒక అభిప్రాయానికి వచ్చేశారనీ, జగన్ మాట తప్పని మనిషనీ, అందుకే సీఎంని చేస్తామని ప్రజలు అంటున్నారని ఓ కథనంలో రాశారు!
ఇక, జగన్ విజన్ గురించి రాస్తూ… రాష్ట్రం పట్లా ప్రజల పట్లా ఆయనకి స్పష్టమైన విజన్ ఉందనీ, పాదయాత్రలో ఆయన అవలంభిస్తున్న వ్యవహార శైలిని చూసి ప్రజలు దీన్ని గుర్తించారన్నారు! ఇచ్చిన హామీలు గాలికి వదిలేసే చంద్రబాబు నాయుడు తరహాలో జగన్ రాజకీయాలు చెయ్యరని ప్రజలు నమ్ముతున్నారన్నారు. కష్టపడే తత్వం జగన్ కి ఉందనీ, మహానేత బాటను అందుకోగలరనే నమ్మకం ప్రజలకు ఉందనీ, అందుకే ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని రాసేశారు. ఇలా మొత్తంగా ప్రజల కోణం నుంచి, ప్రజలు ఏమనుకుంటున్నారనేది పూసగుచ్చినట్టుగా తమకు తెలుసు అన్న ధోరణిలో సాక్షి కథనం సాగింది.
కష్టాల్లో ఉన్న ప్రజలందరూ జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఎదురు చూస్తున్నారట..! ప్రాక్టికల్ గా ఆలోచిస్తే… కష్టాల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా ముందుగా దాన్నుంచి బయటపడాలని చూస్తాడు. సగటు మనిషి వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న కష్టానికి రాజకీయ పరిష్కారం కోసం చూస్తాడా..? ఎప్పుడో జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప మా కష్టాలు తీరవని కూర్చుంటారా..? ఇంకోటి, అలుపెరుగని బాటసారి, అవిశ్రాంత పాదయాత్ర అంటూ కొన్నిచోట్ల ప్రస్థావించారు. జగన్ పాదయాత్రలో వారానికో బ్రేక్. ఇక, మధ్యలో తీసుకున్న సెలవులు కూడా చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు అవిశ్రాంతం ఎలా అవుతుంది?
జగన్ విజన్ ఏంటనేది సాక్షి కూడా స్పష్టంగా చెప్పలేకపోయింది. జగన్ కు స్పష్టమైన విజన్ ఉందని పాదయాత్రలో అవలంభించిన తీరు చూసి ప్రజలు నమ్ముతున్నారన్నారు! పాదయాత్రలో అనుసరించిన విజన్ ఏముంది..? పాదయాత్ర నిర్వహణకూ, రాష్ట్ర భవిష్యత్తుకూ పోలిక ఏంటి..? విజన్ అంటే ముఖ్యమంత్రి మీద విమర్శలు కాదు కదా! ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి సాయం కావాలి. అవసరమైతే తెగించి కేంద్రంపై పోరాటం చెయ్యగలగాలి. ఆ సామర్థ్యం జగన్ కి ఉందా..? ఆ క్రమంలో రకరకాల ఒత్తిళ్లు ఎదురౌతాయి. వాటికి తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగే తెగువ జగన్ కి ఉందా..? వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగాలి. దాన్ని పెంచగలిగే దీర్ఘ కాలిక ప్రణాళిక జగన్ దగ్గర ఉందా..? ఇచ్చిన హామీలన్నీ మడమ తిప్పకుండా అమలు చేస్తారని ప్రజలు నమ్మారని సాక్షి రాసింది. ఆ హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు కావాల్సిన బడ్జెట్ ఎంత, దాన్ని ఎలా తీసుకొస్తారన్న లెక్కలు జగన్ దగ్గర ఉన్నాయా..? రాష్ట్రంలో ప్రతీ పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే అని జగన్ చెప్పడాన్ని గొప్ప విజన్ అని సాక్షి రాసింది! అది పరిశ్రమలకు వచ్చాక చెప్పాల్సిన మాట. దానికంటే ముందు రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజ సంస్థల్ని రాబట్టగలిగే చతురత జగన్ కి ఉందా..? ఇలా ప్రజలు ఎదురుచూస్తున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి.
జగన్ ముఖ్యమంత్రి కావాలనీ, అయిపోతున్నారనీ, చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ సాక్షి రాసేసింది. ఇది కేవలం జగన్ వ్యక్తిగత రాజకీయ లక్ష్యం! కానీ, ఆంధ్రా ప్రజలు సమస్యలకు సమాధానాలు చూస్తున్నారు. విజనరీ నాయకత్వం వైపు చూస్తున్నారు. ఆ లోటు జగన్ లో ఇప్పటికీ స్పష్టంగానే కనిపిస్తోంది.