ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్లలో జరిగిన అరాచకాలు అక్రమాల గురించి, రైతులకు ఏవిధంగా అన్యాయం జరిగింది, అమరావతి ప్రాంతంలో అరాచకాలు, అక్రమాల గురించి సాక్షి దినపత్రికలో వరుస కథనాలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాను ప్రపంచం అంతా తిరిగి నిర్మించిన బ్రాండ్ ఇమేజిని ఇలాంటి దుష్ప్రచారాలు దెబ్బతీస్తున్నాయ్ అని చంద్రబాబునాయుడు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి మీద కేసులు వేస్తాం అని అంటున్నారు. ‘పడిన బురదను మమ్మల్ని తడుచుకోమంటే కుదరదు.. వారిని నిరూపించమని అడుగుతాం’ అంటూ చంద్రబాబునాయుడు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. విషయం ఏంటంటే.. పడిన బురదను తుడుచుకోవడం మాత్రం ఆయన పనే. ఎందుంటే మకిలిపట్టి కనిపించేది ఆయనే గనుక! ఆయనే కడుక్కోవాలి. వారే వచ్చి కడిగేదాకా నేను ఎదురుచూస్తూ కూర్చుంటా అని ఆయన మాటలు చెప్తూ ఉంటే.. ఆ బురద అట్టకట్టిపోతుంది. ముఖ్యమంత్రి వర్యులు చెబుతున్నట్లుగా ఆయన సృష్టించిన బ్రాండ్ ఇమేజి సర్వభ్రష్టం అవుతుంది.
వివరాల్లోకి వెళితే.. సాక్షి రాతల వల్ల ఏపీకి తాను సృష్టించిన బ్రాండ్ ఇమేజి పోతున్నదని చంద్రబాబునాయుడు అన్నారు. వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాధినేత అయినా ఇంతకంటె భిన్నంగా స్పందించలేరు గానీ.. మొత్తానికి రాజధాని భూముల విషయంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయనే సంగతిని ఎవరైనా చెప్పగలరు! కాకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఆ మాత్రం ‘ఎడ్వాంటేజీ’ తీసుకుని అక్రమాలు చేయకుండా ఉంటారా? అని సర్దుకుపోవడం జనం నైజం అయిపోయింది. అలా కుదరదని సాక్షి ప్రశ్నించడం వల్ల ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
అలాగని సాక్షి రాసిన ప్రతి అక్షరమూ నిప్పు తునక అనడానికి కూడా వీల్లేదు. ఎటూ భూఅక్రమాలు అక్కడ ఉన్నాయి గనుక.. పనిలో పనిగా దానికి చిలవలూ పలవలూ చేర్చి..చంద్రబాబునాయుడు మీద (ఆయన బురద అని అనుకుంటున్నారు గానీ.. ) వీలైనంత విషం కక్కడానికి సాక్షి ప్రయత్నించిన మాట వాస్తవం. అయితే వారి ఆరోపణల్లో కొన్ని అర్థసత్యాలు, వక్రీకరణలులు, అడ్డగోలుగా అన్వయించడమూ వంటివి అనేకం ఉంటాయి. అయితే ప్రభుత్వంలో ఉన్నందుకు గాను.. సదరు ఆరోపణలు అన్నిటినీ తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంటుంది.
ఇక్కడ శోచనీయమైన విషయం మరొకటి ఉంది. ‘నేను సృష్టించిన బ్రాండ్ ఇమేజి పోతుందో’ అంటూ చంద్రబాబు చాలా విలపిస్తున్నారు. ఆయన బాధ ఎంతసేపూ సింగపూర్,జపాన్ లేదా నిన్న వచ్చిన ఇంగ్లాండు ప్రతినిధి.. వీరిదృష్టిలో ఎంత పరువు నష్టం అన్న యాంగిల్లో మాత్రమే ఉంది. ఈ వార్తలు, అక్రమాలే గనుక నిజమైతే.. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నందుకు.. చంద్రబాబుకు ప్రభుత్వం అప్పగించిన అయిదుకోట్ల మంది ప్రజల గుండెల్లో రగిలే మంటల గురించి ఆయన ఆలోచించడం లేదు. బ్రాండ్ ఇమేజిని ఎలా తగలెట్టాలో తర్వాత… ముందు ఇక్కడి ప్రజలు ఎంత బాధపడతారో ఆయన మాట్లాడ్డం లేదు. అయితే అక్రమాలు నిజమే అయితే.. ఆ నేతలు బహుశా అంతో ఇంతో డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ బ్రాండ్ ఇమేజి గుర్తించేవాళ్లు కాకపోయినా.. ప్రజల గుండెల్లో పడిన మంటల ముద్ర వారి పతనాన్ని నిర్దేశిస్తుందనడం ఖాయం.
నారాయణ మార్కు నాటకాలు కుదరవు!
‘ప్రభుత్వానికి నేను ఏటా 200 కోట్ల రూపాయలు పన్నులు కడుతూ ఉన్నా’ అని ప్రకటించినంత మాత్రాన నారాయణ నిజాయితీ పరుడు నెంబర్ 1 అయిపోతారని అనుకుంటే భ్రమే. విద్యార్థుల జీవితాల్ని కత్తి అంచు మీద పెట్టి సాగించే విద్యావ్యాపారంలో ఎన్నివేల కోట్లు ఆర్జిస్తూ ఉంటే ఆ 200 కోట్ల పన్నులు కడుతున్నారో కూడా ఆయన సెలవిస్తే బాగుంటుంది. పన్నులు కట్టడం కూడా ప్రజాసేవ కింద భావించే మేధావులుగా మంత్రివర్యులుగా ఉండడం ఒక రకంగా దౌర్భాగ్యం. నారాయణ సంస్థలో ఉద్యోగిగా ఉన్నంత మాత్రాన భూములు కొనుక్కోకూడదా? అని నారాయణ ప్రశ్నిస్తున్నారు. తన ఉద్యోగి భూములు కొంటే బినామీ అయిపోతారా? అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.
మరి సదరు ఉద్యోగితోనే ప్రెస్మీట్ పెట్టించండి. ‘నా సొత్తుకు యజమానిగా నారాయణ పేరు రాస్తున్నారేమిటి?’ అంటూ సాక్షితో పోరాడమని చెప్పండి. ఆ భూములు కొనే స్థోమత, సొమ్ము తనకు ఎక్కడినుంచి వచ్చాయో ఆ ‘ఉద్యోగి’ని వెల్లడించమని చెప్పండి. అప్పుడు సాక్షి చేస్తున్నది దుష్ప్రచారం అనే సంగతి అందరికీ విపులం అయిపోతుంది కదా!
అలాగే నాకొడుకు పేరుతో కొనుక్కుంటే కూడా బినామీ అవుతుందా? అని పయ్యావుల కేశవ్ ప్రశ్నిస్తున్నారు. నిజమే. అది బినామీ కాకపోవచ్చు. పైగా శాసనసభలో సీఎం రాజధాని గురించి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత… ఆ భూములు కొన్నానని ఆయన చెబుతున్నది నిజమే అయితే.. తప్పుబట్టడానికి ఆస్కారమే లేదు.
కానీ ఇక్కడ అసలు ప్రస్తావన బినామీ పేర్లతో కొన్నారా? కొడుకుల పేర్లతో కొన్నారా? అనేది మాత్రమే కాదు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది గనుక.. మీరంతా రాజధాని ఎక్కడ రావాలో ముందుగా నిర్ణయించేసుకుని, ఆ ప్రాంతంలో మీరు భూములు కొనేసుకుని.. ఆ తర్వాత రాజధాని ప్రకటన చేయడం గురించి!! అంటే ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది గనుక.. మీరు తప్పుడు దొంగ మార్గాలు ఎంచుకుని.. వాస్తవంగా అయితే ఆ ప్రాంతపు రైతులకు దక్కవలసిన లాభాలను అడ్డదారిలో కాజేశారు. మీరు ప్రభుత్వంలో భాగంగా ఉండడం వల్ల మాత్రమే ఈ అక్రమం జరిగింది.
వ్యాపారం చేయడం కూడా తప్పేనా అని చంద్రబాబునాయుడు ఇవాళ అడుగుతున్నారు. నిజానికి వ్యాపారం తప్పు కాదు. కానీ ఆ వ్యాపారినికి ప్రభుత్వ సమాచారాన్ని తప్పుడు మార్గాల్లో వాడుకోవడం తప్పు. రాజధాని ప్రకటించే నాటికి అసైన్డ్ సహా భూములు ఎవరి పేరుతో ఉన్నాయో వారికే రాజధాని వాటా భూములు ఇస్తాం అంటూ చంద్రబాబునాయుడు ప్రకటించారు. అసలు డ్రామా అంతా ‘రాజధాని ప్రకటించే నాటికి’ అనే పదం దగ్గరే ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన వారంతా.. తాము చేయగలిగిన అక్రమాలు అన్నీ ప్రకటనకు ముందే చేసేశారు కదా! చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు చెప్పేస్తే ఆ పప్పులు ఉడుకుతాయని అనుకుంటే పొరబాటు.
ఆ మాటకొస్తే… సాక్షి చేసిన ఆరోపణల పట్ల జయభేరి గ్రూపు అధినేత రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యక్తం చేసిన ఆవేదన సబబుగా ఉంది. తాను ఎన్నికలకు ముందే భూములు కొన్నానని ఆయన వెల్లడించారు. ‘ఎన్నికలకు ముందు’ అనే మాట నిజమే అయిన పక్షంలో సాక్షి తప్పుడు వార్త రాసినట్లే లెక్క. అదే సమయంలో ఎన్నికల ముందు పావలా అర్ధా ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుని ఉండి, ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వమూ, మరియు రాజధాని ప్రాంతమూ ఖరారుకాగానే కొనుగోలు పూర్తిచేసి ఉన్నా కూడా అక్రమంగానే దానిని పరిగణించాలి.