ఒక రాజకీయ పార్టీకి పత్రిక ఉండటం కచ్చితంగా అదనపు బలం. ఎందుకంటే, పార్టీ సిద్ధాంతాలనూ వ్యవహారాలనూ నిత్యం ప్రజల్లో ఉంచే బలమైన మాధ్యమం మీడియా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ సాక్షి మీడియా అండగా ఉంటోంది. అయితే, పార్టీకి దిక్సూచిగా, మార్గదర్శిగా వ్యవహరించాల్సిన సమయంలో ఆ బాధ్యతల్ని సదరు పత్రిక సక్రమంగా నిర్వర్తించగలుగుతోందా అనేది ఎప్పుడూ ప్రశ్నే? పార్టీ అధ్యక్షుడు ఏం చెబితే అది చెయ్యడమే తప్ప, పార్టీకి అవసరమైన సమయంలో ఒక పెద్దన్న పాత్రను పోషించడం లేదు. చివరి, గడచిన ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలకు అక్షర రూపం ఇచ్చే కరపత్రంగా మాత్రమే పనిచేసిందే తప్ప… ఒక వ్యూహాంతో జగన్ ఎన్నికల ప్రచారానికి అదనపు బలం చేకూర్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… ఎన్నికల ముందు రాయాల్సిన కథనాలను ఇప్పుడు రాస్తోంది కాబట్టి!
ఇవాళ్టి సాక్షిలో తమ్ముళ్లకే ఉపాధి అంటూ ఓ కథనం రాశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కేవలం తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే ఉపయోగపడిందనీ, అసలైన కూలీల సంఖ్య రోజు రోజుకీ పడిపోతోందనీ, టీడీపీ నాయకులు ఈ పథకం ద్వారా బాగా లబ్ధి పొందారని రాశారు. ప్రతీయేటా కూలీల చెల్లింపులు రూ.5 లక్షలు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడి అమాంతంగా రూ. 25 లక్షల వరకూ ఎందుకు పెరిగిపోయాయనేది సాక్షి ప్రశ్న? ఈ పథకం వల్ల కూలీలు లాభపడలేదనీ, కాంట్రాక్టర్లు లాభపడ్డారని రాశారు. ఉపాధి హామీ సక్రమంగా అమలు కాకపోవడం వల్లనే గ్రామాల నుంచి వలస సంఖ్య పెరిగిందనీ, ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యేలా చేసింది తెలుగుదేశం నేతలే అని ఆరోపించారు. ఈ పథకం కింద ప్రతీ కుటుంబంలో ఒకరికి ఏడాదిలో 100 రోజులు పని ఇవ్వాల్సి ఉంటుందనీ, చాలా చోట్ల ఆ సంఖ్య 10 రోజులు మాత్రమే ఉందని రాశారు. దీని కోసం కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందనేది కూడా రాశారు.
ఇప్పుడీ కథనం రాయడం వల్ల పార్టీపరంగా వైకాపాకి ఏం ఉపయోగం ఉన్నట్టు..? సరే, ఇదంతా ప్రజల కోసమే చేసిన ఇన్వెస్టిగేషన్ అనుకుందాం! గడచిన ఐదేళ్లూ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉన్నాయని వారే రాస్తున్నారు కదా… ప్రతిపక్ష పార్టీగా ఈ ఐదేళ్లూ కూలీల తరఫున జగన్ ఎందుకు పోరాటం చేయలేదు మరి? గడచిన ఐదేళ్లపాటు సామాన్య ప్రజల తరఫున ఈ పత్రిక ఎందుకు ఇలా గొంతు విప్పలేదు? సరిగ్గా నిన్నటి పత్రికలోనే… రాష్ట్రంలో కరువు బీభత్సం అంటూ ఓ కథనం రాస్తూ… రాష్ట్రంలో ఉపాధి హామీలు పనులు అస్సలు జరగడమే లేవన్నట్టు పేర్కొన్నారు. ఇవాళ్టి పత్రికలో… పనులు జరుగుతున్నాయిగానీ, టీడీపీ వాళ్లకు మాత్రమే లాభించేలా జరుగుతున్నాయని రాశారు. అదీ వదిలేద్దాం… ఇప్పుడీ కథనం రాయడం వల్ల తక్షణం స్పందించి చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా…? ఇంతకీ ఎవరు స్పందించాలని ఈ కథనం ఉద్దేశం..? దీని వల్ల ఇప్పటికిప్పుడు ఉపాధి హామీల కూలీలకు ఏమైనా మేలు జరుగుతుందా..? ఈ కథనం వల్ల రాజకీయంగా వైకాపాకి ఏదైనా అనుకూలత ఉందా..? ఇలాంటి కథనాలు ఎన్నికల ముందు విరివిగా రాసి ఉంటే పార్టీకి ప్లస్ అయ్యేది కదా! ఇప్పుడీ తరహా కథనాలను రోజూ గుమ్మరించడం వల్ల పార్టీ పత్రికగా పార్టీకి ఉపయోగపడాలనే ప్రథమ లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతోందా..?