సాక్షి ఫేక్ వార్తలు ప్రచురిస్తోందని.. తప్పుడు ప్రచారాలతో మత విద్వేషాలు సైతం రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో లేదు. అధికారపక్షంలోనే ఉంది. అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పటి గగ్గోలే పెడుతోంది. ఇటీవల నల్లగొండలో పల్నాడుకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడిని భూ తగాదాలతో అతని అల్లుడే హత్య చేశాడు. సాక్షి తెలంగాణ ఎడిషన్లో మామను హత్య చేసిన అల్లుడు అని రాశారు.
కానీ ఏపీకి వచ్చే సరికి టీడీపీ గూండాలు నల్లగొండలో దాక్కున్నా వెంటాడి హత్యచేశారు అని రాశారు. ఇంత కంటే ఎం కావాలి.. ఆ సాక్షి ఎడిటర్ ఫేక్ వార్తలు వండి వారుస్తున్నాడన్న సాక్ష్యం కోసం. నిన్నటికి నిన్న తిరుపతి గోశాలలో ఆవులు చనిపోకపోయినా.. ఎక్కడివో ఫోటోలు తెచ్చి ప్రచారం చేసేశారు. ఎంత మంది నమ్మతారు..ఎంత మంది నమ్మరు అనేది అనవసరం.. ఓ పుకారు ప్రజల్లోకి పంపించి పదే పదే అదే నిజమని చెప్పడం ద్వారా నమ్మించాలని వైసీపీ వ్యూహం. దానికి సాక్షి ఆయుధం. ఈ విషయం టీడీపీకి తెలుసు.. కానీ అడ్డుకట్ట వేయలేకపోతోంది.
మీడియాకు అధికారాలు.. హక్కులు ఉంటాయి కానీ.. తెలిసి కూడా ఫేక్ న్యూస్ ప్రసారం చేసే వారికి ఉండవు. తమను నమ్మే గొర్రెలు ఉంటాయని వారిని గొర్రెల్లాగే ఉంచి.. అవాస్తవాలు చెప్పి నమ్మిద్దామని సాక్షి అనుకుంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు దానికి విరుగుడు కనిపెట్టాల్సింది కూడా టీడీపీనే కదా. అరెస్టులు, కేసులతో సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా ఎన్నో దారులు ఉంటాయి. వాటిని వాడుకోలేకపోతే ఇక అధికారం ఎందుకన్న ప్రశ్న క్యాడర్ కు వస్తుంది. అందులో తప్పు లేదు. చేతకాకపోతే ఫేక్ న్యూస్ అని గగ్గోలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు.