ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉదయపు నడకకు జనం వెళ్లే పార్కుల్లో, టీ కొట్ల దగ్గర, రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్ వెయింటింగ్ హాళ్లు.. ఇలా ఎక్కడ చూసినా ఓ పత్రిక కనిపిస్తోంది. ఉదయం పూట రోడ్డు మీదకు వెళ్లే వాళ్లకు.. ఎదురొచ్చి మరీ… పత్రికను చేతిలో పెట్టేస్తున్నారు. ఆ పత్రిక ఏదో కాదు.. సాక్షి. జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక సాక్షి. టీడీపీ నేతలు అవినీతి పుత్రిక అంటారు.. కానీ.. ఇప్పుడు అన్నింటికన్నా… ఈ సాక్షినే జగన్ ఎక్కువ నమ్ముకున్నట్లుగా ఉన్నారు. ఏపీలో ఒక్క సారిగా సర్క్యూలేషన్ రెండింతలు చేశారు. ఉచితంగా పంచడం ప్రారంభించారు. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేదు… అందరికీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ…!
వైఎస్ హయాంలో.. భారీ పెట్టుబడులతో ప్రారంభమైన సాక్షి పత్రిక… సర్క్యలేషన్ మొదట్లో.. 13 లక్షల దాకా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో… వైఎస్ ఓ వెలుగు వెలుగుతూ… అంతులేని అధికారాన్ని అనుభవిస్తున్న సమయంలో సర్క్యూలేషన్ అది. ఆ తర్వాత వైఎస్ మరణం.. రాష్ట్ర విభజన కారణాలతో… ఇప్పటికి… ఆ పత్రిక సర్క్యూలేషన్.. రెండు రాష్ట్రాలతో కలిసి ఎనిమిది, ఎనిమిదిన్నర లక్షలకు చేరుకుంది. ఇందులో రెండున్నర నుంచి మూడు లక్షలు.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ కిందకు పోగా… మిగతా ఐదున్నర నుంచి ఆరు లక్షలు ఆంధ్రప్రదేశ్ కిందకు వస్తుంది. ఇప్పుడు.. ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసమే.. ఏకంగా పదకొండు లక్షల కాపీలు ప్రింట్ చేస్తున్నారని …మీడియా సర్క్యులేషన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ రోజూ… ఆయా ఊళ్లకు వచ్చి డెలివరీ పాయింట్లు.. డబుల్ ఇండెంట్ పంపుతున్నారు. ఇందులో ఐదు లక్షలు మాత్రమే సేల్ కాపీలు. మిగతా వన్నీ పబ్లిక్‌లో పంచి పెడుతున్నారు. రోజూ ఇదే వరుస.
నిజానికి…ఇది పాంప్లెట్లుగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పత్రికను ఎవరూ ఉచితంగా ఇవ్వరు. ఉచితంగా ఇస్తూ… ఓ పార్టీ ఫోటోను మాస్ట్ హెడ్డ్గా పెట్టుకుని మరీ ప్రింటింగ్ చేస్తున్నందున… వాటిని ప్రచార ఖర్చులో కలపాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. ఎవరు.. వాటిని స్పాన్సర్ చేస్తున్నారో.. కింద ముద్రించాల్సి ఉంటుంది. అయితే సాక్షి పత్రిక.. ఈ అదనపు ఐదు లక్షల కాపీల ప్రింటింగ్‌ను … లెక్కలో చూపిస్తుందో లేదో.. అన్న చర్చ మీడియా వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే.. ప్రింట్ ఆర్డర్.. ఎంత ఉంటే అంత వరకు ప్రింట్ చేస్తారో.. ఆర్డర్ లేకుండా.. ప్రింట్ చేస్తే.. దాన్ని అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ అంగీకరించదు. తప్పు పడుతుంది. అందుకే ఇప్పుడు కేవలం… లెక్కల్లో లేకుండా.. అదనపు ప్రింట్లు వేసి… పంచుతున్నారని.. చెబుతున్నారు. దీనిపై.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని.. ఏపీలోని ఇతర పార్టీలు.. భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.