ఆంధ్రుల రాజధాని అమరావతిపై… పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన .. సంచలనం రేకెత్తించింది. ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లన్నీ చర్చల మీద చర్చలు పెట్టాయి. కానీ.. సాక్షి పత్రికలో ఒక్కటంటే.. ఒక్క వార్త కూడా రాలేదు. మెయిన్ పేజీలో కాదు కదా.. కనీసం.. జిల్లా ఎడిషన్‌లోనూ వార్త రాలేదు. అసలు బొత్స కు సంబంధించిన వార్తనే .. సాక్షి పత్రిక కవర్ చేయలేదు. మంత్రి హోదాలో బొత్స చేసింది చిన్న ప్రకటన కాదు. రాజధానిని మార్చేస్తున్నట్లుగా దాదాపుగా ఆయన నిర్ధారించారు. రాజధానిలో ముంపు ఉందని… అక్కడ నిర్మాణాలు అత్యధిక ఖర్చుతో కూడుకున్నాయని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. సాక్షి పత్రిక.. పూర్తిగా ఈ వార్తను ఇగ్నోర్ చేసింది.
బొత్స ప్రకటనపై.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన కారణంగానే సాక్షి వెనక్కి తగ్గిందా.. లేక… ప్రభుత్వ అనుమతి లేకుండా.. సొంతంగా బొత్స ఈ ప్రకటన చేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వరదల కారణంగా రాజధానిలోని ఒక్క గ్రామంలోకి కూడా నీరు రాలేదు. ఒక వేళ ముంపు వస్తే.. తక్షణం నీటిని తరలించడానికి కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అయినప్పటికీ.. బొత్స.. తలా తోక లేని ప్రకటన చేశారని.. రాజధానిని తరలించడానికే.. ఈ సాకులు చెబుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఇప్పటికే.. నీళ్లంటినీ ఒకేసారి వదిలి… ముంపు గ్రామాల్లోకి నీటిని పంపాలనే ప్రయత్నం చేశారనే.. వాదన.. గట్టిగా.. రాజధాని గ్రామాల్లో వినిపిస్తోంది. అంత చేసినా.. ముంపు రాకపోయినా.. వచ్చిందని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
బొత్స సత్యనారాయణ… కొన్నాళ్ల కిందటి వరకూ.. అమరావతి ఎక్కడికి పోదు.. అన్నింటినీ పరిశీలించి… అవినీతిని వెలికి తీసి.. స్వచ్చంగా మళ్లీ నిర్మిస్తామని చెబుతూ ఉండేవారు. కానీ హఠాత్తుగా మాట మార్చారు. ప్రభుత్వంలో చర్చ జరగకుండా.. ఓ మంత్రి ఇలా చెప్పే అవకాశం లేదు. అయినప్పటికీ.. ప్రభుత్వ గెజిట్ లాంటి సాక్షి మాత్రం… బొత్స ప్రకటనను లైట్ తీసుకుంది. బహుశా.. ప్రజల స్పందన ఏమిటో తెలుసుకోవడానికి.. బొత్సతో ఇలాంటి ప్రకటన చేయించిందని అంటున్నారు. అయితే… అది ప్రభుత్వ విధానం కాదని… చెప్పుకోవడానికి సాక్షిలో కవర్ చేయలేదంటున్నారు. ఏదైనా కానీ.. మొత్తానికి… అమరావతిపై ఏపీ సర్కార్ ఓ మైండ్ గేమ్ ఆడుతోందని మాత్రం.. అటు బొత్స ప్రకటన.. ఇటు సాక్షి దాన్ని ప్రచురించకపోవడంతోనే అర్థమవుతోందంటున్నారు.