టీవీ9 లో వస్తున్న వార్తలు సంగతి ఎలా ఉన్నా, ఈ మధ్యకాలంలో టీవీ9 ఒక వార్త కావడం తరచుగా జరుగుతోంది. రవి ప్రకాష్ ని నాటకీయ పరిణామాల మధ్య ఛానల్ నుంచి గెంటి వేయడం, ఆ తర్వాత ఛానల్ మీద టిఆర్పి రేటింగులు తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు రావడం, ఈ మధ్యకాలంలో ఛానల్ రెండో స్థానానికి పడిపోవడం, ఇటువంటి వార్తలతో గత ఏడాది కాలంగా ఈ వార్తా ఛానల్ వార్తల్లో నిలుస్తోంది. అయితే వీటన్నింటిని తలదన్నేలా మరొక కొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. టీవీ నైన్ ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉందని, త్వరలోనే సాక్షి ఛానల్ లో ఇది విలీనం కాబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
లోటస్ పాండ్ లో ఛానల్స్ యజమానుల మధ్య కీలక చర్చలు:
అయితే తాజాగా లోటస్ పాండ్ రెండు చానల్స్ ప్రజల మధ్య కీలకమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రెండు చానల్స్ ని సూత్రప్రాయంగా ఒకే గొడుకు కిందకు తీసుకు రావడానికి ఆ చానల్స్ యజమానులు నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో ఈ సమావేశానంతరం రూమర్స్ గుప్పుమంటున్నాయి. టివి9 ని సాక్షి గ్రూప్ లో విలీనం చేసేందుకు తుది దశకు చర్చలు చేరుకున్నాయని, త్వరలోనే యాజమాన్యాలు నిర్ణయాన్ని ప్రకటించనున్నాయని, తెలుగు మీడియా రంగంలో అతి పెద్ద డీల్ ఇదే అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
టీవీ9 సాక్షి లో విలీనం కావాల్సిన అవసరం ఇప్పుడు ఏంటి?
ప్రస్తుతం రెండు చానల్స్ మధ్య జరిగిన చర్చ లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నానార నే విషయం అధికారికంగా తెలియరావడం లేదు. కానీ ఒకవేళ నిజంగా tv9 సాక్షి లోకి విలీనం కావాల్సి వస్తే అందుకు కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చ జోరుగా నడుస్తోంది. పేరుకి నెంబర్ వన్ చానల్ గా ఉన్న టీవీ9 భారీగా నష్టాల్లో కూరుకుపోయిందని, గత రెండేళ్లుగా నష్టాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి అని, అందువల్లే టీవీ9 యజమాన్యం దీనికి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఒక వాదన.
మరొక వాదన ప్రకారం, టీవీ9 ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక గుజరాత్ లతోపాటు అనేక భాషల్లో చానల్స్ కలిగి ఉండడమే కాకుండా భారత దేశ వ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉంది. కెసిఆర్ గత ఎన్నికల్లో మిస్ అయిపోయిన ఫెడరల్ ఫ్రంట్ వ్యూహాన్ని మళ్లీ తెరపైకి తీయనున్నారని, ఇందుకోసం దేశ వ్యాప్తంగా నెట్వర్క్ కలిగిన టీవీ9 ఛానల్ ని, సాక్షి తో సహా కలుపుకుని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా బలమైన ఎడిటోరియల్ బోర్డు తయారు చేయాలనుకుంటున్నారని, ఆ మీడియా సంస్థ దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ కి అనుకూలంగా పని చేస్తుందని మరొక వాదన వినిపిస్తోంది.
విలీనమా లేక కేవలం ఎడిటోరియల్ బోర్డు సాయమా?
అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల లో పలుచోట్ల లాజిక్ మిస్ అవుతుంది. నంబర్ వన్ పొజిషన్లో ఉన్న టీవీ9 నష్టాలలో ఉంటే, మొదటి ఐదు ర్యాంకుల లో ఎక్కడా కనిపించని సాక్షి మరింత నష్టాల్లో ఉండి ఉండాలి. మొదటి స్థానంలో ఉన్న ఛానల్ మొదటి ఐదు స్థానాల్లో కూడా కనిపించని సాక్షిలోకి కేవలం ఆర్థిక కారణాల వల్ల విలీనం అవుతుంది అన్న వాదనలో పస కనిపించడంలేదు. అందువల్ల ఇదిిిి పూర్తిస్థాయి విలీనం కాదు అని, కేవలం ఎడిటోరియల్ బోర్డు కి సంబంధించిన విషయాలలో సాక్షిి సహాయాన్ని టీవీ9 కోరింది అన్నది మరొక వాదన.
గతంలో ఎన్డీటీవీతో ఎడిటోరియల్ బోర్డు కు సంబంధించిన ఒప్పందం కలిగి ఉన్న సాక్షి, ఎడిటోరియల్ బోర్డు కి సంబంధించిన విషయాలలో బలంగానే ఉన్నప్పటికీ, ఎడిటోరియల్ బోర్డు విషయంలో టీవీ9 పదహారేళ్లుగా పరిశ్రమలో ఉన్న కారణంగా సాక్షి కంటే బలంగా ఉంది. కాబట్టి టిఆర్పి రేటింగులు పడిపోయిన కారణంతో టీవీ9 సాక్షి ఎడిటోరియల్ బోర్డు సాయం కోరింది అన్న వార్త కూడా హాస్యాస్పదంగా కనిపిస్తోంది.
అటు ఆర్థిక పరమైన కారణాలతో విలీనం చేసే అగత్యం లేకుండా, ఎడిటోరియల్ బోర్డు విషయంలో సహాయం పొందవలసిన బలహీనమైన పరిస్థితిలో లేకుండా ఉన్న టీవీ9 దేనికొరకు సాక్షి తో చర్చలు జరిపి ఉంటుందన్న విషయంలో విశ్లేషకులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశం వెనుక కంటికి కనిపించని, ఇప్పటివరకు బహిర్గతం కాని రాజకీయ కారణాలు, పరిణామాలు ఉండే అవకాశం ఉందని, సాక్షి మరియు టీవీ9 ఒకే గొడుగు కిందకు వస్తున్నాయన్న వార్త నిజం అయితే గనుక దాని వెనుక ఆర్థికపరమైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధితమైన కారణాల కంటే రాజకీయ కారణాలే ప్రధానం అయి ఉండే అవకాశం బలంగా కనిపిస్తోంది అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజలకు రాజకీయ వార్తలు అందించే ఛానల్సే రాజకీయాలతో నలిగిపోవడం, ప్రజలకు వార్త గా మారిపోవడం, సమకాలీన సమాజంలో మారుతున్న పరిస్థితులకు దర్పణం పడుతోంది.
– జురాన్ (@CriticZuran)