పెథాయ్ తుఫాను వల్ల జరిగిన నష్టంపై సాక్షి స్పందిచేసింది! ఎలా అంటే, ‘పెథాయ్ పగ.. సర్కారు దగా’ అంటూ! తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం… నిలువునా వంచించే ప్రయత్నం చేస్తోందంటూ ఒక కథనం రాసేశారు. లేనిపోని నిబంధనలు అడ్డుపెడుతూ… రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమని మోసం చేస్తున్నారని రైతులు అంటున్నారనీ, టెక్నాలజీతో నష్టాన్ని గొప్పలు నివారించామని చెప్పుకుంటున్నారని రైతులు అంటున్నారని సాక్షి రాసింది.
పెథాయ్ వల్ల కేవలం 66 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతోందన్నారు. కానీ, లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని నిపుణులు అంటున్నారని రాశారు. ఆ లక్షలు ఎన్ని అనేవి సాక్షి చెప్పలేదు! పంట నష్టం జరిగినా, దాదాపు తొంభై శాతం పొలాలను జాబితా నుంచి తొలగిస్తున్నారనీ, కుప్ప వేయని వరి పంట తడిస్తే నష్టం ఇవ్వరనీ, తడిసిన పంటలను నమోదు చెయ్యొద్దన్నారనీ… కొన్ని నిబంధనల పేరుతో చెల్లించే పరిహారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దొంగ లెక్కలు వేస్తోందంటూ కథనంలో రాశారు. ఒక్కరోజులోనే నష్టం వివరాలు సేకరించారనీ, ఇలా ఒకే రోజులో నష్టాన్ని అంచనా వేయడం ఎలా సాధ్యమంటూ ఇలా సాక్షి ప్రశ్నించింది.
అసలు విషయం ఏంటంటే.. పెథాయ్ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రభుత్వమే ఇంకా పూర్తి చెయ్యలేదు. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి, శుక్రవారం సాయంత్రానికి నష్టంపై ఓ అంచనా వస్తుందని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే ఎఫ్.సి.ఐ. ద్వారా కొనాలంటూ కేంద్రాన్ని కోరామన్నారు. రైతులు వివరాలు, సర్వే నంబర్ల వారీగా పంట నష్టం అంచనా వేస్తామని మంత్రి చెప్పారు. అంటే, పంట నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఆ లెక్కల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈలోపుగా సాక్షి స్పందించేసి… 66 వేలు ఎకరాలే నష్టమని ప్రభుత్వం చెబుతోందని రాసేశారు. వాస్తవానికి, బుధవారం వరకూ ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం 74,432 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పింది. ఇది బుధవారం నాటి అంచనా మాత్రమే. మరో రెండ్రోజులైతేగానీ పూర్తి లెక్కలు రావు. కానీ, సాక్షి మాత్రం లక్షలాది ఎకరాలు అంటూ… ఆ లక్షలు ఎన్నో కచ్చితంగా చెప్పలేని కథనం రాసింది. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే… తడిసిన పంటల్ని లెక్కించరట అంటూ రాసేశారు! ఎందుకింత అత్యుత్సాహం..? నిజంగానే రైతుల పక్షాన్ని నిలవాలనుకుంటే.. ఓ రెండ్రోజులు ఆగొచ్చు కదా! ఈలోపుగానే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం వెనక రాజకీయ లబ్ధి ప్రయత్నమే కదా కనిపిస్తోంది..!