సాక్షి దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్న ప్రభాకర్ అనే జర్నలిస్టు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దూకిన తర్వాత కనిపెట్టిన ఆ దారిన వెళ్తున్న వారు… లేక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోగానే… ప్రభాకర్ హుస్సేన్ సాగర్‌లో మునిగి చనిపోయాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభాకర్‌కు చాలా అనుభవం ఉంది. టీవీ9 నుంచి గెంటివేతకు గురైన రాజశేఖర్ అనే జర్నలిస్టు నేతృత్వంలో దాదాపుగా పదేళ్ల కిందట ఐన్యూస్ చానల్ ప్రారంభమయింది. ఆ చానల్లో.. పిన్ కౌంటర్ పేరుతో వచ్చే ప్రోగ్రాం చాలా ఫేమస్ అయింది.
దానికి రూపకల్పన చేసిన వారు ఎవరైనా.. ఏళ్ల తరబడి.. స్క్రిప్ట్ రాసింది మాత్రం… ప్రభాకరే. ఆయన రచనల వల్లే ఆప్రోగ్రాం హిట్ అయిందని చెప్పుకుంటారు. ఆ తర్వాత టీవీ5లోనూ అలాంటి కార్యక్రమానికి స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశారు. ఆ తర్వాత సాక్షి దినపత్రికలో చేరారు. ఎంతో ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్… జయసుధ కుమారుడు హీరోగా నటించిన బస్తీ అనే సినిమాకు మాటలు కూడా అందించారు. అలాంటి జర్నలిస్టు హఠాత్తుగా… ఆత్మహత్య చేసుకోవడం మీడియా వర్గాలను… సైతం ఆశ్చర్య పరిచింది.
పనిలో ఒత్తిళ్లు వల్ల కానీ…. కుటుంబపరమైన కారణాల వల్ల కానీ అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. జర్నలిజంలో ఉన్న ఒత్తిళ్ల వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న అభిప్రాయం.. చాలా మందిలో ఉంది. ప్రభాకర్.. ఆత్మహత్య ఘటన… హైదరాబాద్ జర్నలిస్టు సర్కిళ్లలో కలకలం రేపింది.