రాష్ట్రంలో ప్రతిపక్షమే పరిపాలన చేస్తోందేమో అన్నట్టుగా ఉంటుంది వైకాపా పత్రిక సాక్షి తీరు! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగానీ, చివరికి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యల్నిగానీ వారికి అనుకూలంగా ఏ స్థాయి వక్రీకరణకైనా వెనకాడటం లేదు. ఈ మధ్య ఓట్ల తొలగింపు మీదే సాక్షి పడిన సంగతి తెలిసిందే. ఓటమిపై భయంతోనే తమ ఓట్లను తెలుగుదేశం పార్టీ తొలగిస్తోందన్నది వారి ఆరోపణ. ఇక, ఇవాళ్టి పత్రికలో… ఈ తొలగింపు కార్యక్రమం చినబాబు కనుసన్నల్లో జరుగుతోందని విమర్శించింది. కొంతమందికి ఔట్ సోర్సింగ్ కి ఇచ్చి మరీ ఓటర్ల జాబితాలో తొలగింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని రకాల సేవల్ని ఓటర్ల తొలగింపు కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగించేసుకుంటున్నానీ, చివరికి కలెక్టర్లూ ఉన్నతాధికారులూ ఇదే పనిలో ఉన్నారని రాసేశారు.
ఇటీవల కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్థావిస్తూ… ఆర్టీజీఎస్, ఇ-ప్రగతి సమిష్టిగా పనిచేసేలా చూడాలని ఆయన అన్నారనీ, అన్ని సేవలనీ ఆన్ లైన్ లో రియల్ టైమ్ లో అందించాలని చూడాలన్నారని చెప్పారు. ఎన్నికల వల్ల ప్రజలకు అందించే సేవలకి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని సీఎం చెప్పారని రాశారు. అయితే, ఇలా చెప్పడం ద్వారా పరోక్షంగా అన్ని వ్యవస్థల్నీ వినయోగించుకోండని టీడీపీ నాయకులకి సీఎం చెప్పారట! సాక్షి మార్కు వక్రీకరణ అంటే ఇదే. ఎన్నికల వల్ల ప్రజలకు అందించే సేవల విషయంలో ఇబ్బంది రాకూడదూ అని సీఎం అంటే… అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థల్నీ పార్టీ ప్రయోజనాల కోసం వాడేసుకోండని సాక్షికి వినిపించింది. వాస్తవానికి సీఎం చేశారంటూ వారే రాసిన వ్యాఖ్యల్లో రెండో అర్థానికి ఆస్కారమే లేదు. కానీ, సాక్షి విశ్లేషణాత్మక దృష్టికి రెండో కోణం కనిపించేసిందట!
ఇంకోటి, ఓటర్ల తొలగింపు కోసం కలెక్టర్లనీ, ఉన్నతాధికారులను సీఎం వాడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదెలా వాడతారో కూడా చెబితే బాగుంటుంది కదా. వైకాపా మద్దతుదారుల ఓట్లను తొలగించడం అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా సీఎం అమలుచేస్తున్న స్థాయిలో సాక్షి ఆరోపిస్తోంది. గత కొద్దిరోజులుగా సాక్షి ఇంత గొంతు చించుకుంటోందిగానీ… ఇంతవరకూ పక్కాగా ఆధారాలను ప్రజలకు చూపలేకపోయింది. ఓటమికి ఒక బలమైన కారణాన్ని ముందుగానే వెతికిపెట్టుకునే బలమైన ప్రయత్నంగా ఈ మధ్య సాక్షి తీరు కనిపిస్తోంది.