విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కత్తి దాడి జరిగిన దగ్గర్నుంచీ గడచిన ఆరు రోజులుగా ప్రతిపక్ష పార్టీ పత్రిక ‘సాక్షి’ కథనాలు రాస్తూనే ఉంది! కాస్త అటుఇటుగా అన్నింటి సారాంశం ఒక్కటే. జగన్ పై హత్యాయత్నం వెనక ముఖ్యమంత్రే ఉన్నారు, ఆ దిశగా దర్యాప్తు జరగడం లేదు, ఏపీ పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం లేదు, జగన్ అడ్డు తొలగించుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవచ్చన్నది టీడీపీ ప్రయత్నం… ఇవే అంశాల చుట్టూ వారికి నచ్చిన అల్లికలతో కథనాలు సాక్షి రాసుకుంటూ పోతోంది. సరే, రాజకీయంగా ఒక పార్టీ పత్రిక కాబట్టి, ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలే వారి ఎడిటోరియల్ పాలసీలో ఉండే మొదటి ప్రాధాన్యతాంశం కాబట్టి, పార్టీ తరఫున గొంతును వినిపిస్తున్నారు. అయితే, ఈరోజు సాక్షిలో టీడీపీలో జరిగిన అంతర్గత సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు విశ్వసనీయంగా తమకు వినిపించాయంటూ ఓ కథనం వేశారు!
జగన్ పై దాడి అంశానికి ఏమంత ప్రాధాన్యత లేదన్నట్టుగా వ్యవహరించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారని సాక్షి తెలిసిందట! అందుబాటులో ఉన్న మంత్రులూ నాయకులతో చంద్రబాబు మాట్లాడారనీ, రోజూ ఇదే అంశంపై నేతలు మీడియా ముందు మాట్లాడుతూ ఉంటే ఇబ్బందులొస్తాయని అన్నారట! అంతేకాదు, ఈ ఘటన వల్ల పార్టీకి ఎంత ప్రయోజనం వచ్చిందనేది కూడా ఆరా తీశారట! జగన్ పై దాడి జరిగిన రోజు నుంచీ నేటి వరకూ పరిణామాలను నేతలకు చంద్రబాబు వివరించారనీ, దీని వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని, అందుకే ఈ ఘటనపై ఇంకా ఎక్కువగా ఎవ్వరూ మాట్లాడొద్దని చంద్రబాబు అన్నారట!
ఈ చిన్న కథనం ఎలా ఉందంటే… జగన్ పై హత్యాయత్నం టీడీపీ ప్లాన్ చేసినట్టు, అదే మైండ్ సెట్ తో ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడినట్టు, ఈ ఘటన వల్ల మనకు రాజకీయంగా ఉపయోగపడట్లేదన్నట్టు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని ముఖ్యమంత్రే చెబుతున్నట్టు రాసుకొచ్చారు! ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ఘటనపై చర్చ జరుగుతుంది. కానీ, ఏ కోణంలో.. రాష్ట్రంలో శాంతి భద్రతల కోణం వరకూ చర్చ ఉంటుంది. అంతేగానీ.. ఇలా ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడారు అని సాక్షికి తెలిసిందనడం ఊహాజనితం అనేది ప్రజలకు ఇట్టే అర్థమౌతుంది. ఏదో సినిమాకి స్క్రిప్ట్ రాసినట్టు పత్రికలో కథనాలుంటే ఎలా..? ఒకవేళ ఇలాంటి చర్చే టీడీపీలో పక్కా జరిగిందనప్పుడు… ఆ ‘విశ్వసనీయ సమాచారం’ ఎక్కణ్నుంచి వచ్చిందో కూడా ప్రజలకు చెప్పాలి. ఇంకోటి… ఈ కథనం ప్రకారం జగన్ పై దాడికి టీడీపీ ప్రయత్నించిందనే ఆధారాలు దీన్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు, దీన్ని కేవలం ఒక చిన్న వార్తగానే కాకుండా… పెద్ద కుట్రకు ఆధారంగా ఈ సమాచారాన్ని పోలీసులకే ఇవ్వొచ్చు కదా! ‘విశ్వసనీయ సమాచారం’ అనే లైన్ ముందు తగిలించేసి… ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒకటి రాసేయడం సరైందా..?