సాక్షి పత్రిక , సాక్షి ఛానల్ పూర్తిగా విలువల వలువలు వదిలేసినట్టు కనిపిస్తోంది. ఎన్నికల వేడి మొదలైన నాటి నుండి సాక్షి పత్రిక మరియు ఛానల్ ప్రతి రోజు కూడా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకుని అనేకానేక ఆరోపణలు చేస్తోంది. అయితే సాక్షి చేస్తున్న ఆరోపణలన్ని అబద్ధం అని కొద్ది గంటల్లోనో,కొద్దిరోజుల్లోనో తేలిపోతున్నాయి. తాజాగా ఈరోజు సాక్షి చేసిన ఆరోపణలు కూడా అబద్ధమయ్యాయి.
మొన్నామధ్య తెనాలి సీటులో నాదెండ్ల మనోహర్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజాను చంద్రబాబు తప్పిస్తున్నారు అంటూ బ్రేకింగ్ న్యూస్ కొట్టింది సాక్షి. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద డమ్మీ అభ్యర్థిని పెట్టడం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారంటూ ఆ రోజంతా స్క్రోలింగ్ ఇచ్చింది. ఇక విశాఖపట్నంలో లో జే.డి లక్ష్మీనారాయణ నీ గెలిపించుకోవడానికి లోకేష్ తోడల్లుడు భరత్ కి చంద్రబాబు టికెట్ నిరాకరిస్తున్నాడు అంటూ రోజంతా వార్తలు రాసింది. అయితే సాక్షి ఒక రోజంతా పనిగట్టుకు చేసిన ప్రచారం అంతా 24 గంటల్లో అబద్ధం అని తేలిపోయింది. ఆలపాటి రాజా, పల్లా శ్రీనివాసరావు లతోపాటు భరత్ కు కూడా టికెట్ దక్కింది.
ఇక తాజాగా ఈరోజు ఉదయం నుంచి సిపిఐ పార్టీ జనసేన తో తెగతెంపులు చేసుకోనుంది అని, మధ్యాహ్నానికి లేదంటే సాయంత్రానికి సిపిఐ రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని ఖరారు చేస్తాడని ఉదయం నుంచి సాక్షి ఢంకా బజాయించి చెప్పింది. అయితే పొద్దున్నుంచి సాక్షి జనాల బుర్రలోకి ఎక్కించడానికి ప్రయత్నించిన ఆరోపణలన్నీ అబద్ధమని రాత్రికంతా తేలిపోయింది. సిపిఐ రామకృష్ణ “జనసేన తోనే తమ పొత్తు కొనసాగుతుందని ” ఆదివారం రాత్రి అధికారిక ప్రకటన ఇచ్చాడు.
ఇక అలాగే గత కొద్దిరోజులుగా విజయవాడ టికెట్ లింగమనేని రమేష్ కు పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నాడు అంటూ సాక్షి ప్రచారం చేసింది. పారిశ్రామికవేత్త అయిన ఈయనకు గతంలో చంద్రబాబు తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఈయనకు టికెట్ కేటాయించడం కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు అయ్యాడని చెప్పడానికి మరొక నిదర్శనం అంటూ విపరీతంగా కథనాలు ప్రసారం చేసింది. అయితే చివరికి ముత్తం శెట్టి ప్రసాద్ అనే ఒక లాయర్ కు పవన్ కళ్యాణ్ టికెట్ ఖరారు చేశాక మాత్రం దానికి సంబంధించిన ఎటువంటి వార్త ఇవ్వకుండా కిమ్మనకుండా కూర్చుండిపోయింది సాక్షి.
“ఈ రోజు మా **** టూత్ పేస్ట్ వాడారా”, “ఈ రోజు మా **** కూల్ డ్రింక్ త్రాగారా” అంటూ కొన్ని కమర్షియల్ యాడ్స్ లో పంచ్ లైన్ రాస్తూ ఉంటారు. అలాగే, ” ఈ రోజు సాక్షి చేసిన ఆరోపణలు కూడా అబద్ధమయ్యాయి” అంటూ జనాలు అనుకునే పరిస్థితి వచ్చింది.