బ్రో సినిమాపై ఎంత ఏడ్వాలో అంతా ఏడుస్తోంది వైకాపా ప్రభుత్వం. ఓ సినిమాని టార్గెట్ చేసి మంత్రులే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్డడం, కలక్షన్ల వివరాలు తెలియజేయడం ఏపీలోనే సాధ్యం. ప్రభుత్వ పనితీరు ఇంతకు పతనమైందని బాధ పడాలో, ఒక హీరోని చూసి, అతని సినిమాని చూసి కుళ్లిపోతున్న నేతల్ని చూసి జాలి పడాలో అర్థం కావడం లేదు.
ఈ రోజు అంబటి ప్రెస్ మీట్లు పెట్టి – బ్రో కలక్షన్ వివరాల్ని మీడియా చెప్పారు. ఇదెంత సిల్లీ పనో..? ఆయనేమైనా సినిమా వాడా? సినిమాకి సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఉన్నారా? ఈ సినిమాకీ, ఆ సినిమాకొచ్చిన కలక్షన్లకీ ఆయనకీ ఉన్న లింకేమిటో అర్థం కావడం లేదు. ఓ సినిమా వసూళ్లని నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అంకెలతో సహా చెప్పడం.. నిజంగానే హాస్యాస్పదం. అది అటు ఉంచుదాం.
బ్రో సినిమాపై సాక్షి టీవీ ఈరోజు ఓ స్పెషల్ స్టోరీ చేసింది. సాక్షి జర్నలిస్టులు తీవ్రంగా అన్వేషించి, తమ మేధస్సునంతా ఖర్చు చేసి బయటపెట్టిన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో బ్లాక్ మనీ పెట్టుబడిగా పెట్టారట. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ టీడీపీ వ్యక్తి అని, పవన్‌కి ఇచ్చే ప్యాకేజీని ఆయన పారితోషికం రూపంలో పవన్‌కి అందించారని, ఇది ప్యాకేజీ సినిమా అని తేల్చిపాడేసింది సాక్షి టీవీ. దీనికన్నా విడ్డూరం మరోటి ఉంటుందా?
బ్రో ఓ సినిమా. ఈ సినిమా కోసం పవన్ పని చేశాడు. దానికి తగిన పారితోషికం అందుకొన్నాడు. సినిమా హిట్టా, ఫ్లాపా? ఈసినిమా వల్ల ఎవరు లాభ పడ్డారు? అనేది వేరే విషయం. దాన్ని ప్యాకేజీలో కలపడం ఏమిటి? నిన్నా మొన్నటి వరకూ పవన్‌ని ప్యాకేజీ స్టార్ అన్నారు. ఇప్పటికీ అంటూనే ఉన్నారు. అయినా దాన్ని నిరూపించడానికి వైకాపా దగ్గర ఆధారాలేం లేవు. దాంతో ఇప్పుడు రూటు మార్చారు. పవన్ తీసుకొన్నది పారితోషికం కాదు.. ప్యాకేజీ అంటున్నారు. అంటే పవన్ ఏ సినిమా చేసినా అది ప్యాకేజీ కిందే లెక్క. వాళ్లంతా చంద్రబాబు నాయుడు మనుషులా? మైత్రీ లో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ తో ఓ సినిమా తీస్తున్నాడు. హరి హర వీరమల్లుకి ఏఎం రత్నం నిర్మాత. వీళ్లంతా టీడీపీ మనుషులా? పవన్ జనసేన స్థాపించింది ఇప్పుడు కాదు. పదేళ్ల ప్రయాణం ఉంది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నింటి వెనుకా టీడీపీ ఉన్నట్టా? పవన్ ఈ సినిమాకి తీసుకొంది అక్షరాలా 40 కోట్లు. పవన్ 500 కోట్లు తీసుకొన్నాడు, 1000 కోట్లు తీసుకొన్నాడు అని నొక్కి వక్కాణించిన వైకాపా.. ఇప్పుడు ఆ 40 కోట్లతో సర్దుకుపోతోందా?
సాక్షి అక్కసు ఈ స్పెషల్ స్టోరీ చూసిన వాళ్లందరకీ అర్థమయ్యే ఉంటుంది. ఓ సినిమాపై ఇంత కక్ష సాధింపా? ఓ హీరోని అడ్డుకోవడాని ఇన్ని ప్రయత్నాలా? ప్రభుత్వ సంక్షేమం గురించీ, పధకాల గురించీ, వాళ్లపై వస్తున్న విమర్శల గురించీ మాట్లాడాల్సిన నేతలు.. ప్రెస్ మీట్ పెట్టి కలక్షన్ వివరాలు చెప్పడంతోనే ఈ ప్రభుత్వం పతావస్థలో ఉందన్న విషయం అందరికీ అర్థమైపోతోంది. వైకాపా దిగజారడానికి ఇక మెట్లేమీ లేనట్టే లెక్క.