తెదేపాని విమర్శించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వైకాపా జారవిడుచుకోదని మరోమారు నిరూపిస్తూ, కేంద్ర పౌరవిమాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు గురించి ఈరోజు సాక్షి మీడియాలో ఒక వార్త ప్రచురించింది. ఆయన క్రింద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్న అప్పారావుకి ఆయుధాల వ్యాపారి సంజయ్ బండారితో రహస్య లావాదేవీలు కలిగి ఉన్నారని సిబిఐ సంస్థ కనుగొన్నట్లు పేర్కొంది. గత ఏడాది సంజయ్ బండారి నివాసంలో సిబిఐ జరిపిన శోదాలలో, అప్పారావు 355 సార్లు బండారీతో మాట్లాడినట్లు కనుగొందని సాక్షిలో పేర్కొంది. కానీ అప్పారావు మాత్రం తాను అన్నిసార్లు బందారీతో మాట్లాడలేదని చెప్పినట్లు సాక్షి పేర్కొంది. విమానయాన సంస్థకు అవసరమైన పరికరాలు, యంత్రసామాగ్రిని తయారుచేసే సంస్థలకు సంజయ్ బండారీ ప్రతినిధిగా పనిచేస్తున్నందునే, ఆ పని మీద కొన్నిసార్లు ఆయనతో మాట్లాడానని అప్పారావు చెప్పినట్లు పేర్కొంది. సంజయ్ బండారి గత ఏడాదిన్నర కాలంలో మంత్రి అశోక్ గజపతి రాజు నివాసానికి మూడు, నాలుగుసార్లు అదేపని మీద వచ్చి కలిశారని అప్పారావు చెప్పినట్లు సాక్షిలో పేర్కొంది.
సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి సంజయ్ బండారి లండన్లో విలాసవంతమైన భవనం నిర్మించి ఇవ్వడంపై ప్రస్తుతం కాంగ్రెస్, భాజపాల మద్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. కనుక సంజయ్ బండారితో మాట్లాడిన మంత్రి అశోక్ గజపతికి, అప్పారావు కూడా అవినీతిపరులే అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేయడం చాలా హాస్యాస్పదం. అశోక్ గజపతి రాజు ఉన్నత వ్యక్తిత్వం గురించి తెలిసిన వారెవరూ ఆయనని వేలెత్తి చూపలేరు. ఆయన గురించి తెలియని వాళ్ళు లేదా తెదేపాను ద్వేషించేవాళ్ళు మాత్రమే వేలెత్తి చూపుతుంటారు. మోడీ ప్రభుత్వంలో మంత్రులు, భాజపా నేతలు రాబర్ట్ వాద్రాని లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. సంజయ్ బండారి సంస్థ ఆర్ధిక వ్యవహారాలు, లావాదేవీలపై ఈడి విచారణ చేస్తున్నమాట వాస్తవమే. ఆ సంగతి తెలిసి కూడా అశోక్ గజపతి రాజు అదే సంస్థతో వ్యవహారాలు నడిపారని, వాటిని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తూ ఊరుకొన్నారని భావించలేము. ఒకవేళ అశోక్ గజపతి రాజు లేదా ఆయన అధికారి అప్పారావుకి అవినీతికి పాల్పడిన్నట్లు సిబిఐ లేదా ఈడి అధికారులు కనుగొని ఉండి ఉంటే ఆ విషయం ఇంతకాలం రహస్యంగా దాచిపెట్టడం ఆశాభావం. ఈపాటికే వాళ్ళిదరిపై కూడా ఆరోపణలు రావడం, తత్ఫలితంగా కేసులు నమోదు అవదమో లేదా రాజీనామాలు చేయడమో జరిగి ఉండేది. కానీ అటువంటిదేమీ జరుగలేదంటే ఆ ఆరోపణలలో నిజం లేదని స్పష్టం అవుతోంది. కనుక వాస్తవాలు తెలుసుకోకుండా ఒక నిజాయితీపరుడైన మంత్రిపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు.