పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల తరువాత తన సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఒకటి రెండుసార్లు రాజధాని భూములు, కాపులకు రిజర్వేషన్ల విషయంలో మాట్లాడేందుకు ఒకటిరెండుసార్లు మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఇదివరకులా ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడలేదు. జనసేన పార్టీని స్థాపించి రెండేళ్ళు కావస్తున్నా, దానిని నిర్మించుకొని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు ఏదీ చేయలేదు.
వచ్చే ఎన్నికల సమయానికి జనసేన పార్టీ పోటీ చేస్తుందని మొదట్లో చెప్పడమే కానీ ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు ఆ మాటనలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమికి ప్రచారం చేయమని కోరినప్పటికీ ఆయన అందుకు అంగీకరించలేదని వార్తలు వచ్చేయి. కనుక వచ్చే ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమికి ప్రచారం చేస్తారో లేదో అనుమానమే. ఆయన తీరు చూస్తుంటే రాజకీయలపై పూర్తిగా ఆసక్తి కోల్పోయినట్లు కనిపిస్తుంది. ఆయన రాజకీయాల కంటే సినిమాలలోనే బాగా రాణిస్తున్నారు కనుక అందులోనే కొనసాగాలాని ఆయన అభిమానులు కోరుకొంటున్నారు.
అయితే వైకాపా స్వంత పత్రిక సాక్షి ఆయన మరో రెండు మూడు సినిమాలు చేసిన తరువాత సినీ పరిశ్రమ నుండి శాస్వితంగా రిటైర్మెంట్ తీసుకొని తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే వెచ్చించబోతున్నట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయని తనే ఒక కట్టుకదని అల్లి ప్రచురించింది. ఆయన 2018వరకు సినిమాలు చేసి ఓ వంద కోట్లు కూడబెట్టుకొని రాజకీయాలలోకి రావాలనుకొంటున్నట్లు పేర్కొంది. 2018 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటించిన ఆఖరి సినిమా రిలీజ్ అవుతుందని పేర్కొంది.
తమ పార్టీ ఎమ్మెల్యేలని తెదేపాలోకి లాగేసుకోవడం ప్రారంభించినప్పటి నుండి సాక్షిలో ఇటువంటి చిత్రవిచిత్రమయిన కధనాలు చాలానే వస్తున్నాయి. ఆ పార్టీలో అప్పుడే ముసలం పుట్టిందని, చాలా మంది సీనియర్ నేతలు తమకు అన్యాయం జరుగుతుందని అసహనంగా ఉన్నారని కధనాలు ప్రచురిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి తన జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేస్తున్నారంటూ మరో కట్టుకధని ప్రచారంలోకి తీసుకువచ్చి తెదేపాను భయపెట్టాలని ప్రయత్నిస్తునట్లుంది. తెదేపాను దెబ్బ తీయడం కోసం పవన్ కళ్యాణ్ పేరు వాడుకొనే ప్రయత్నాలు చేస్తే వైకాపా ఆయన అభిమానుల ఆగ్రహం చవిచూడవలసి వస్తుందని గ్రహిస్తే మంచిదేమో.