ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్ర మూర్తి మంగళవారం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఎం.ఎస్.ఓ.ల ఫెడరేషన్, కేంద్రసమాచార ప్రసార శాఖ ముఖ్య కార్యదర్శి, టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుగానే ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారుల ద్వారా ఎం.ఎస్.ఓ.లపై ఒత్తిడి తెచ్చి సాక్షి మీడియా ప్రసారాలను నిలిపివేసిందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. సాక్షి ప్రసారాలను ప్రభుత్వమే నిలిపివేయించిందని స్వయంగా హోం మంత్రి చిన రాజప్ప మీడియాకి చెప్పిన విషయాన్ని కూడా తన పిటిషన్ లో పేర్కొన్నారు. తద్వారా భావప్రకటన స్వేచ్చకి భంగం కలిగించినట్లయిందని కనుక తక్షణమే సాక్షి ప్రసారాలు పునరుద్దరించవలసిందిగా ప్రభుత్వాన్ని, ఎం.ఎస్.ఓ.లను ఆదేశించవలసిందిగా తన పిటిషన్ లో కోరారు.
తెలంగాణాలో సుమారు ఏడాది పాటు నిషేధానికి గురైన రెండు ప్రముఖ న్యూస్ చానల్స్ తమ ప్రసారాల పునరుద్దరణ కోసం సుదీర్గ న్యాయపోరాటం చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అనేక రకాలుగా ఒత్తిళ్ళు చేశాయి. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వంతో రాజీ పడిన తరువాతే ఆ చానల్స్ ప్రసారాలు పునరుద్ధరించబడిన సంగతి తెలిసిందే. దానిని బట్టి చూస్తే సాక్షి న్యాయపోరాటం కూడా ఫలించకపోవచ్చని భావించవచ్చు. సాక్షి మీడియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తోంది కనుక కేంద్రం కూడా దానికి సహకరించకపోవచ్చు. ‘సాక్షి ప్రసారాలను ప్రభుత్వమే నిషేధించిందని’ రాష్ట్ర హోం మంత్రి చెప్పిన మాటే ఈ కేసులో సాక్షికి ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. కానీ చానల్స్ ప్రసారంలో అనేక మంది వ్యక్తులు, వ్యవస్థలు ఇమిడి ఉన్నందున, ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక కారణం చూపించి నిషేధం కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఈ కేసుని వాయిదాలు వేసుకొంటూ ఎంతకాలం అయినా సాగదీసే అవకాశం ఉంది. కనుక సాక్షి న్యాయపోరాటం చేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు.