జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును ముందుగానే సాక్షి మీడియా ప్రకటించేయడం కలకలం రేపింది. ఉదయం సీబీఐ కోర్టు సమయం ప్రారంభం కాగానే .. సాక్షి మీడియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పిటిషన్‌ను సీబీఐ న్యాయమూర్తి కొట్టి వేశారని బెయిల్ షరతులు ఉల్లంఘించలేదన్న జగన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒక్క సారిగా వైరల్ అయింది. నిజానికి అప్పటికి తీర్పు చెప్పలేదు. దీంతో వెంటనే సాక్షి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ట్వీట్‌ను తొలగించారు. కానీ అప్పటికే వైరల్ అయింది.. అనేక మంది స్క్రీన్ షాట్లు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సీబీఐ కోర్టు తీర్పు ముందే ఎలా తెలిసిందని నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సాక్షి మీడియాకు ప్రశ్నలు వెల్లువెత్తాయి. కిషన్ రెడ్డి తో జగన్మోహన్ రెడ్డి భేటీని ప్రస్తావిస్తూ ఏమైనా అండర్ స్టాండింగ్ ఉందా అంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రశ్నలు ప్రారంభించారు. ట్వీట్ డిలీట్ చేసినా వైరల్ అవుతూండటంతో సాక్షి మీడియా యాజమాన్యం మరో ట్వీట్ చేసింది. సమాచారలోపం వల్ల ఆ ట్వీట్ చేశామని.. వెంటనే తొలగించామని.. పొరపాటుకు చింతిస్తున్నామని ట్వీట్ చేసింది.
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. బెయిల్ రద్దవుతుందా లేదా అన్న అంశంపై పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. మీడియా సంస్థలు కూడా అంతే ఆసక్తిగా ఉన్నాయి. అందుకే తీర్పు రాగానే ప్రకటించేందుకు బెయిల్ రద్దు అని.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టి వేత అని మూడు నాలుగు రకాలుగా టెంప్లెట్స్ రెడీచేసుకుని ఉంటాయి. సాక్షిలో బెయిల్ పిటిషన్ కొట్టి వేత అనే టెంప్లెట్ మాత్రమే రెడీ చేసుకుని ఉంటారు. తీర్పు వచ్చినప్పుడు పోస్ట్ చేయాలని చెప్పి ఉంటారు.. కానీ సోషల్ మీడియా బాధ్యతలు చూసే ఉద్యోగి అత్యుత్సాహంతో ముందే పోస్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.