తెలుగు లో ఉన్న అగ్ర ఛానళ్లలో రెండవ స్థానంలో ఉన్న ఒక ఛానల్ లో రాబోయే రెండు వారాలు వార్తలను ఎలా ప్రజెంట్ చేయాలో, ఏ తరహాలో వార్తలు ఇవ్వాలో సాక్షి ఛానల్ కు సంబంధించిన సిబ్బంది పర్యవేక్షిస్తోందా? వైయస్ జగన్ కి అనుకూలంగా ఉండేలాగా ప్రతి వార్తను రూపొందించేలా వైఎస్సార్ సీపీకి కి, రెండవ స్థానంలో ఉన్న ఆ ఛానల్ కి మధ్య అవగాహన కుదిరిందా? దీనికి అవుననే సమాధానం మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
మొదటి స్థానంలో ఉన్న ఒక న్యూస్ ఛానల్ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా మారిపోవడంతో చాలాకాలంగా అందులోని వార్తలను ప్రజలు నమ్మడం మానేశారు. ఇప్పుడిప్పుడే ఆ చానల్ లో జగన్ కి కవరేజ్ ఇస్తున్నప్పటికీ, ఆ చానల్ మీద ఇదివరకే నమ్మకం కోల్పోయిన వీక్షకులు ఆ ఛానల్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే రెండవ స్థానంలో ఉన్న ఇంకొక వార్త ఛానల్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గాని, పూర్తిగా వైఎస్ఆర్సిపి కి అనుకూలంగా కానీ గత మూడు నాలుగేళ్లలో పనిచేయకపోవడంతో ప్రజల్లో ఆ ఛానల్ పట్ల కాస్త మంచి అభిప్రాయం ఉంది. అయితే కీలకమైన ఈ రెండు మూడు వారాల పాటు ఆ ఛానల్ లో వచ్చే వార్తలు జగన్ కి అనుకూలంగా, ఏకపక్షంగా ఉండేలా ఒప్పందం జరిగినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా, పైకి తటస్థంగా కనిపిస్తూనే, వార్తల్లో మాత్రం జగన్ కి అనుకూలంగా, ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేసే వాదనలని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను ఈ ఛానల్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఛానల్ సిబ్బంది శక్తిసామర్థ్యాల మీద నమ్మకం లేని వైఎస్ఆర్ సీపీ నేతలు, సాక్షి లో పనిచేసిన ఎడిటోరియల్ సిబ్బందిలో ఒకరిని ఈ ఛానల్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమించినట్లుగా తెలుస్తోంది.
మొన్నామధ్య వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తటస్థ వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన ఈ ఛానల్ హఠాత్తుగా పూర్తిగా యూటర్న్ తీసుకుని గత రెండు రోజులుగా జనసేన పై ఉద్దేశ్య పూర్వకంగా తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సభలను, ప్రచారాలను కవర్ చేయకపోగా, తాను మాట్లాడే మాటల్లోని ఒకటి రెండు లైన్లు మాత్రమే తీసుకుని ఆ వీడియోలతో పవన్ కళ్యాణ్ ను నెగటివ్ చేసేలా కథనాలను రూపొందిస్తోంది. అయితే గత రెండు రోజుల్లో వచ్చినది కేవలం శాంపిల్ మాత్రమే నని, రాబోయే రెండు మూడు వారాల పాటు పవన్ కళ్యాణ్ పార్టీ మీద , సాక్షి సిబ్బంది పర్యవేక్షణలో ఈ ఛానల్ లో మరిన్ని ఇలాంటి కథనాలు రాబోతున్నాయని తెలుస్తోంది.
మరి ప్రజలు ఈ ఛానల్ వైఖరి అర్థం చేసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.