తెదేపా, వైకాపాల మద్య జరుగుతున్న యుద్ధం పరాకాష్టకి చేరుకొన్నట్లే ఉంది. ప్రభుత్వాదేశాల మేరకు ఎం.ఎస్.ఓ.లు నిన్న మధ్యాహ్నం నుంచి విశాఖ జిల్లాలో సాక్షి న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిపివేశారు. జిల్లాలో మారుమూల ప్రాంతాలైన అరుకు, పాడేరు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలో వైకాపా ఛానల్ ప్రసారాలు నిలిచిపోయాయి.
ముద్రగడ పద్మనాభం దీక్ష, ఆయన అరెస్టు, రాజమండ్రి తరలింపు గురించి సాక్షి న్యూస్ ఛానల్ లేనిపోని కట్టుకధలన్నీ ప్రసారాలు చేస్తూ, కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొడుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రసారాలు తాత్కాలికంగా నిలిపివేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది వైకాపాకి చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే, సాక్షి న్యూస్ ఛానల్ వైకాపాకి ఆయువుపట్టు వంటింది. రాష్ట్రంలో ఇంకా అనేక న్యూస్ చానల్స్ ఉన్నప్పటికీ సాక్షి ఛానల్ మాత్రమే వైకాపాకి పూర్తిగా అంకితం అయ్యి దాని గొంతుని ప్రజలకి వినిపిస్తోంది. వైకాపా అభిప్రాయాలని, ఆలోచనలని దాని దృష్టి కోణం నుంచి ప్రజలకి వివరిస్తోంది. దాని ప్రసారాలు నిలిపివేయడం అంటే వైకాపాకి గొంతు నొక్కినట్లే భావించవచ్చు. అందుకే ప్రభుత్వంపై వైకాపా మండిపడుతూ మరో యుద్ధానికి సిద్ధం అవుతోంది. మీడియా గొంతు నొక్కి భావప్రకటన స్వేచ్చను హరించడమేనని వాదిస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసార్లు సాక్షిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందని హెచ్చరించారు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం అనుమతించింది కనుక రెండుమూడు రోజులలోనే సాక్షి ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ మొదలుపెడతామని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు రెండు రోజుల క్రితమే చెప్పారు. వారి హెచ్చరికలపై సాక్షి మీడియా కానీ వైకాపా గానీ స్పందించనే లేదు. ఇంతలోనే ఇది జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చెప్పులతో కొట్టాలని జగన్మోహన్ రెడ్డి అన్నందుకు ముఖ్యమంత్రితో సహా తెదేపా నేతలు అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రకాశం జిల్లాలో నిర్వహించవలసిన మహా సంకల్పం సభని జగన్ స్వస్థలం కడపలో నిర్వహించారు. ఇప్పుడు సాక్షి ప్రసారాలని నిలిపివేసి జగన్మోహన్ రెడ్డికి మరో పెద్ద షాక్ రుచి చూపించారు.
ముద్రగడ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెదేపా గట్టిగా నమ్ముతోంది. అందుకే మిగిలిన అన్ని న్యూస్ చానల్స్ కంటే సాక్షి ఛానల్ లో ఆయనకి ఎక్కువ కవరేజ్ ఇస్తోందనే ఉద్దేశ్యంతోనే దాని ప్రసారాలు నిలిపివేసి ఉండవచ్చు. ఇవ్వాళ్ళ తూర్పు గోదావరి జిల్లా, రేపు పశ్చిమ గోదావరి జిల్లా బంద్ కి కాపు సంఘాలు పిలుపునిచ్చాయి కనుక ఆ రెండు జిల్లాలలో కూడా సాక్షి ప్రసారాలు నిలిపివేయవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే సాక్షి యాజమాన్యం ప్రభుత్వంపై న్యాయపోరాటం మొదలుపెట్టవచ్చు. ప్రభుత్వంపై అది చేసే పోరాటానికి రాష్ట్రంలో మిగిలిన మీడియా సంస్థలు సంఘీభావం ప్రకటిస్తాయా లేదా అనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. ఎందుకంటే రాష్ట్రంలో సాక్షి ఒక్కటీ ఒకవైపు, మిగిలినవన్నీ మరోవైపు ఉన్నాయి.