ఆంధ్రాకి ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేమని మరోసారి భాజపా ఘంటాపథంగా చెప్పింది. అది కూడా సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ లో పేర్కొంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటీషన్ పై కేంద్రం ఫైల్ చేసిన అఫిడవిట్ లో… రైల్వేజోన్ ఊసు లేదు, పోలవరం నిధుల ప్రస్థావన లేదు. ఆంధ్రాకి ఏమీ చెయలేం అని ఇంత స్పష్టంగా కేంద్రం తెగేసి చెబుతుంటే… ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పేదీ లేదన్నట్టు, కేవలం చంద్రబాబు సర్కారుదే తప్పు అన్నట్టు సాక్షి పత్రిక పేర్కొంది.
బాబు నాటకం బట్టబయలు అంటూ ఈరోజు ఓ కథనం వండి వార్చారు. కేంద్రం సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్ ద్వారా రెండేళ్లుగా టీడీపీ ఆడుతున్న నాటకం మరోసారి బయటపడిందని రాశారు. టీడీపీ, భాజపాలు కలిసి చేసిన ప్రకటననే కోర్టుకు కేంద్రం సమర్పించిందనీ, కానీ దీనిపై రాద్దాంతం చేయడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ లబ్ధికి టీడీపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు! ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చర్చించి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసింది. ఆ సమయంలో మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానించారనీ, కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఏదో అన్యాయం జరుగుతోందని టీడీపీ గగ్గోలు పెడుతోందంటూ సాక్షి తన పాత వాదననే వినిపించింది.
ఈ క్రమంలో కేంద్రాన్నిగానీ, ప్రధాని మోడీనిగానీ కనీసం మాటవరసకైనా విమర్శించిన వాక్యం ఒక్కటీ లేదు. చంద్రబాబు సర్కారు తీరు వల్లనే రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందన్న కోణమే తప్ప… విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్రం సక్రమంగా అమలు చేసిందా లేదా అనే విశ్లేషణ సాక్షిలో కనిపించడం లేదు. ఎంతసేపూ.. ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారు, ఇప్పుడు మాట మార్చి మళ్లీ హోదా అంటున్నారన్న గగ్గోలే తప్ప… ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్న అంశాన్నే సాక్షి టచ్ చేయడం లేదు.
హోదాకి బదులుగా అవే ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే… ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా..? 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికీ హోదా ఉండదని కేంద్రమే చెబుతుంటే.. అలా జరగడానికి వీల్లేదని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎదురు తిరుగుతుందా..? ప్యాకేజీ ప్రకటించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మర్యాదపూర్వకంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలి కాబట్టి,అసెంబ్లీలో తీర్మానిాంచారు. కేంద్రాన్ని మెచ్చుకున్నారు. కానీ, ప్యాకేజీ ప్రకటించాక కూడా రెండేళ్లు తాత్సారం జరిగాక కేంద్రంపై టీడీపీ ఎదురుతిరగడం వాస్తవం కాదా..? రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టేసి… భాజపాతో వైరం పెట్టుకుంది వాస్తవం కాదా..? ఇవేవీ సాక్షి రాతల్లో పొరపాటున కూడా కనిపించవు. ఎంతసేపూ కేంద్రాన్ని వెనకేసుకుని రావడం ఒక్కటే సాక్షికి తెలిసిన రాతలు.