ఆంధ్రాలో ఏ రాజకీయ పరిణామం చోటు చేసుకున్నా… ఎందుకో తెలియని ఆందోళనకు వైకాపా గురౌతుంది. ఇక, ఆ పార్టీ పత్రిక ‘సాక్షి’ విషయమైతే చెప్పనక్కర్లేదు! జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు వెంటనే చెప్పేయడానికి సిద్ధపడిపోతోంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరుకి నిర్ణయించుకుంది. తెలుగుదేశం పార్టీతో అవగాహన కేవలం జాతీయ రాజకీయాల వరకే అనే స్పష్టత ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో సాక్షి రాసింది ఏంటంటే… హస్తంతోనే సైకిల్ సవారీ అంటూ చెప్పింది! పొత్తు ఉండదూ అని కాంగ్రెస్ పార్టీ అంత స్పష్టంగా చెబితే… లేదు లేదు ఉందీ అని సాక్షి చెప్పడమేంటో హాస్యాస్పదంగా ఉంది.
కాంగ్రెస్ తో నేరుగా పొత్తుపెట్టుకుని ఎన్నికల్లోకి దిగితే లాభం ఉండదనీ, టీడీపీతో పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారంటూ విశ్లేషించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనను కూడా పూర్తిగా వక్రీకరించేసింది సాక్షి. చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కోల్ కతా సభ తరువాత భాజపాయేతర పక్షాలన్నీ 23న ఢిల్లీలో భేటీ కావాలనుకున్నాయి. దాంతోపాటు, ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావడం, ఏపీ హైకోర్టు ప్రారంభోత్సవానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించడం కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అయితే, భాజపాయేతర పార్టీల సమావేశం వాయిదా పడింది. కారణం, ఫరూక్ అబ్దుల్లా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడటం, ఇతర రాష్ట్రాల్లో కొంతమంది నేతలు స్థానిక కొన్ని కీలక కార్యక్రమాలు పెట్టుకోవడం. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు, చంద్రబాబుకి కూడా అందించారు. దీంతో 23న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ, దీన్ని సాక్షి ఎలా వక్రీకరించిందంటే… భాజపాయేతర సమావేశాల పేరుతో ఢిల్లీ వెళ్లి రాహుల్ ని చంద్రబాబు కలిశారనీ, ఆంధ్రాలో పరోక్ష పొత్తు పెట్టుకుందామని మాట్లాడుకున్నారని ఆ పత్రిక చూసొచ్చినట్టు రాసింది.
కాంగ్రెస్ టీడీపీ మధ్య పరోక్ష పొత్తు అంటూ వైకాపా ఆందోళన వెనక అసలు వాస్తవం వేరే ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ సోలోగా 175 నియోజక వర్గాల్లో పోటీకి దిగితే… ఎన్నో కొన్ని ఓట్లను చీల్చుతుంది. అయితే, అలా చీలిబోయేవన్నీ వైకాపాకి చెందినవి మాత్రమే ఉంటాయనేది వాస్తవం. ఎందుకంటే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైకాపాకి టర్న్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ యాక్టివ్ అయితే… దాన్లో కొంత చీలక తప్పదు. ఈ వాస్తవం వారికి తెలుసు కాబట్టి… ఆ ఆందోళను టీడీపీపై విమర్శలు చేయడం ద్వారా వ్యక్తీకరిస్తూ, ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థుల్నీ చంద్రబాబు నిర్ణయిస్తారనీ, ఖర్చుకూడా ఆయనే పెడతారంటూ ఆ కథనంలో రాసేశారు. ఇక్కడితో ఆగకుండా.. జనసేనతో కూడా పొత్తు కుదిరిపోతుందంటూ కూడా రాసేశారు!