హాయ్ ల్యాండ్ ఆస్తుల వేలానికి సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలే జారీ చేసింది. దీని కనీస ధరను రూ. 600 కోట్లుగా నిర్ణయించి, వెంటనే వేలం వేసే ప్రక్రియను ప్రారంభించాలంటూ ఎస్.బి.ఐ. నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఔత్సాహికులు వేసే బిడ్లకు సంబంధించిన సీల్డు కవర్లను తెరవడానికి వీల్లేదనీ, ఫిబ్రవరి 8న తామే స్వయంగా కోర్టులో తెరస్తామంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఇది కొంత ఊరటనిచ్చే తీర్పే. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత కీలకమైందీ హాయ్ లాండ్. దీన్ని అమ్మేయడం ద్వారా పెద్ద మొత్తంలోని సొమ్మును ఖాతాదారులకు తిరిగి చెల్లించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే, ఈ కేసు విషయమై అధికార పార్టీని దోషిగా చూపించే ప్రయత్నమే ప్రతిపక్ష వైకాపా చేస్తూ వస్తోంది.
తక్కువ ధరకే హాయ్ ల్యాండ్ ఆస్తుల్ని కొట్టేసేందుకు అధికార పార్టీ ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారనీ, డిపాజిటర్లతో ఆడుకుంటున్నారనీ… ఇలా చాలా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఒకవేళ అలా తక్కువ ధరకే కొట్టేయాలని అనుకున్నా.. అది ఎలా సాధ్యమనేదీ వైకాపా నేతలు చెప్పరు! ఆ కుట్రకు సంబంధించిన ఆధారాలేవైనా బయటపెట్టినా బాగుండేది. వ్యవహారమంతా కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు అధీనంలో వేలం ప్రక్రియ జరుగుతున్నప్పుడు… ఇతరులు ఎవరైనా ఎలా జోక్యం చేసుకోగలరు అనే ప్రశ్నకు వారి దగ్గర్నుంచీ సమాధానం ఉండదు. ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాలు ఇంత స్పష్టంగా ఇస్తే… ఈరోజు సాక్షి పత్రికలో ‘పచ్చనేతల ఆశలపై హాయ్ లాండ్ మైన్’ అంటూ విమర్శలు చల్లే కథనం రాశారు. నేడు రూ. 600 కోట్లుగా కోర్టు నిర్ణయించిన హాయ్ ల్యాండ్ ను, కేవలం రూ. 250 నుంచి 300 కోట్లలోపు కొట్టేయడానికి అధికార పార్టీ నేతలు ప్రయత్నించారనీ, వారి ఆశల్ని హైకోర్టు ఆవిరి చేసిందంటూ ఆ కథనంలో రాశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచే హాయ్ ల్యాండ్ పై ఆ పార్టీ ముఖ్యనేతలు కన్నేశారనీ, దాదాపు రూ. 1000 కోట్ల విలువున్న ఆస్తుల్ని అప్పణంగా దోచేసేందుకు ప్రయత్నించారని రాశారు.
సాక్షి కథనం ఎలా ఉందంటే… హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల్లో టీడీపీని దోషిగా చూపిందేమో అనే అనుమానం కలిగించేలా ఉంది! మొత్తం వ్యవహారమంతా కోర్టు పరిధిలో మొదట్నుంచీ నడుస్తోంది. అలాంటప్పుడు, అధికార పార్టీకి చెందినవారు ఏదైనా మతలబు చేయడానికి ఎలా సాధ్యమౌతుంది..? అలాంటిది జరిగితే కోర్టు ఊరకుంటుందా..? అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ప్రభుత్వం నిలబడింది. వీలైనంత త్వరగా వారు దాచుకున్న సొమ్మును వెనక్కి రప్పించే ప్రయత్నమే చేసింది. ఒకదశలో ఆస్తుల్ని కొనేందుకు కొన్ని కంపెనీలు సిద్ధపడ్డా… వారిలో లేనిపోని భయాలను సృష్టించి, వారిని వెనక్కి వెళ్లేందుకు పరోక్షంగా కారణమైంది ఎవరు..? అగ్రిగోల్డ్ బాధితులను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేసిందెవరు..? కోర్టు ఇంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ఈ అంశాన్ని చూస్తున్నది ఎవరు..?