థియేటర్లలో సినిమా మొదలెట్టే ముందు ఈ నగరానికి ఏమైంది అంటూ వేసే యాడ్ విపరీతంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సాక్షి పత్రిక, టీవీ చూస్తుంటే , అసలు ఈ సాక్షి కి ఏమైంది అనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా జనసేన మీద విపరీతమైన వ్యతిరేక కథనాలు రాస్తూ, తమ అభద్రతా భావాన్ని బయటపెట్టుకున్న సాక్షి , ఇప్పుడు కేఏ పాల్ మీద కూడా బలమైన కథనాలు ప్రసారం చేస్తోంది.
వివరాల్లోకి వెళితే, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల పేర్ల కు దగ్గరగా పేర్లు కలిగిన నాయకులను పోటీకి నిలబెట్టాడని, తమ పార్టీకి తమ అభ్యర్థుల కి గండికొట్టడానికి కావాలనే ఈ విధంగా చేస్తున్నాడని సాక్షి కథనం ప్రసారం చేసింది. రాయదుర్గంలో వైఎస్ఆర్సిపి కాపు రామచంద్రారెడ్డిని నిలబడితే, ప్రజాశాంతి పార్టీ ఉండాల రామచంద్రారెడ్డి ని నిలబెట్టింది. ఉరవకొండలో వైఎస్ఆర్ సీపీ విశ్వేశ్వర్‌రెడ్డి నిలబడితే, ప్రజాశాంతి పార్టీ విశ్వనాథరెడ్డి నిలబెట్టింది. అనంతపురంలో వైఎస్ఆర్సిపి అనంత వెంకటరామిరెడ్డి నిలబెడితే, ప్రజాశాంతి పార్టీ పగడి వెంకట్రామిరెడ్డిని పోటీకి నిలబెట్టింది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు లో అయితే అదే పేరు ఉన్న నంబూరు శంకరరావు అనే వ్యక్తిని నిలబెట్టింది. దాదాపు 9 స్థానాల్లో ఈ విధంగా అభ్యర్థులను నిలబెట్టింది ప్రజాశాంతి పార్టీ.
అయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా, వైయస్సార్ ఇదే స్ట్రాటజీని ఉపయోగించారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వ్యక్తులు ఇండిపెండెంట్‌గా చాలా స్థానాలలో పోటీకి నిలబడ్డారు. అప్పట్లో వీరిని ప్రోత్సహించి నిలబెట్టింది వైయస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని చాలా మందికి తెలుసు. వీరిలో చాలామంది 1000 పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ 2-3 స్థానాలను ఈ గ్యాప్ తో కోల్పోయింది. బహుశా అందుకే జగన్ కి , కే ఏ పాల్ అభ్యర్థుల కారణంగా ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. పైగా వైయస్సార్సీపి ఫ్యాన్ గుర్తు కి, ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తుకి ఉండే రెక్కల కారణంగా ఈవీఎం మిషన్‌లో లో కూడా ఓటర్లు కొంత అయోమయానికి గురి అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి ఈ కారణంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ప్రస్తుతం వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు అనే చెప్పాలి. అయితే అధికారం వై ఎస్ ఆర్ సి పి దేనని ఢంకా బజాయించి చెబుతున్న సాక్షి ,పాల్ కి ఈ రేంజిలో భయపడటమే జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.