ఏదో ఒక పాయింట్ తీసుకుని, దానికి అనుగుణంగా ఒక వాదన తయారు చేసుకుని, అది వాస్తవమా కాదా… ఉన్న వాస్తవాలను వక్రీకరించి ప్రజలకు అందిస్తున్నామా… వాస్తవాలు తెలిస్తే ప్రజలేమనుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా కొన్ని కథనాలు వైకాపా మీడియా రాసేసి ముద్రించేస్తుంటుంది! ఇవాళ్టి సాక్షిలో కూడా అలాంటిదే ఓ కథనం ‘కరెంటు బిల్లులా టీడీపీ కరపత్రాలా’ అంటూ రాసేశారు. కరెంటు బిల్లులు అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గురించి ప్రచారం చేసుకుంటున్నారంటూ అక్కసు వెళ్లగక్కారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనీ, కరెంటు బిల్లులపై కూడా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని కథనంలో రాశారు. ‘సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కరెంటు బిల్లుల్ని కరపత్రాలుగా మార్చుకోవడం గమనార్హమని రాశారు, అదేంటో మరి! చంద్రబాబు నాయుడు బొమ్మని ఇలా బిల్లులుపై ముద్రించడం ద్వారా ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేయడమే అవుతుందని చాలామంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారట, వాళ్లెవరో మరి! దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున విద్యుత్ రాయితీలు ఇచ్చినా కూడా ఈ తరహాలో ఎన్నడూ ఫొటోలు వేయించుకోలేదని…. ఇలా ఏదేదో చాలాచాలా రాశారు.
వాస్తవం ఏంటంటే… కరెంటు బిల్లుల వెనక ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. అది ప్రభుత్వం కావొచ్చు, ప్రైవేటు వ్యక్తులు కావొచ్చు. ఐ అండ్ పి.ఆర్.లో ఎంపానల్ అయిన ప్రకటన సంస్థల ద్వారా కరెంటు బిల్లులు, ఆర్టీసీ బస్సు టిక్కెట్ల పేపర్ల వెనక భాగంలో ప్రకటనలు ఇవ్వొచ్చు. ఆ ప్రకటనల ధరలను కూడా కొలతవారీగా ఐ అండ్ పి.ఆర్. నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలనుకున్నా… ఆ ధరను చెల్లించి మాత్రమే ప్రకటన ఇస్తుంది. అంతేగానీ… సాక్షిలో రాసినట్టుగా చంద్రబాబు నాయడు ఆదేశించిగానే ఆదరబాదరాగా బిల్లులు ప్రింటింగులు చేసేస్తారు అనేది వాస్తవం కాదు.
ఇలా ప్రకటనలు ఇచ్చుకోవడం ఏదో నేరం అన్నట్టు, ప్రజలను ప్రభావితం చేస్తోందన్నట్టు సాక్షి అక్కసు వెళ్లగక్కడం… వారి రాజకీయ దుర్బుద్ధిని బయట పెట్టుకోవడం మాత్రమే. ఇదేదో అధికార దుర్వినియోగమూ కాదు, ప్రభుత్వ పథకాల గురించి ప్రకటనలు ఇచ్చుకోవడం ఎవరికో జరిగే అన్యాయం కాదు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అంతకన్నా కాదు. టీవీల్లో, హోర్డింగుల మీద, పత్రికల్లో మాదిరిగానే ఇవీ ప్రకటనలే. కరెంటు బిల్లులపై ప్రకటనలు ఎలా ఇస్తారు అనేది సాక్షికి అవగాహన ఉందో లేదో, ఉన్నా కూడా టీడీపీపై బురద చల్లేద్దామని అనుకున్నారేమో వారికే తెలియాలి.