ఎన్నికల ఫలితాలకంటే ముందుగానే భాజపా వ్యతిరేక పక్షాలన్నీ ఢిల్లీలో భేటీ కావాలనుకున్నాయి. అయితే, ఫలితాల కంటే ముందు భేటీతో పెద్దగా ప్రయోజనం ఉండదనీ, తరువాతే ఉంటే మేలనే అభిప్రాయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. దీంతో భేటీపై సందిగ్ధం నెలకొంది. విపక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాల ముందే కూటమి సమావేశం జరిగితే… ఆ తరువాత, ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలనే మీమాంశ రాకుండా, మెజారిటీ సీట్లున్న కూటమిగా తామున్నామని ముందే ప్రకటించాలనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అయితే, ఈ భేటీపై వైకాపా పత్రిక సాక్షి ఇవాళ్ల ఓ విశ్లేషణ చేసింది!
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలాగూ టీడీపీకి వ్యతిరేకంగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఢిల్లీ స్థాయిలో ఈ ప్రయత్నాలు చంద్రబాబు ముమ్మరం చేశారంటూ సాక్షి రాసుకొచ్చింది. తన తప్పులన్నీ కప్పి పుచ్చుకోవాలంటే… ఢిల్లీలో ఒక ఆసరా అవసరం కాబట్టి, రాహుల్ గాంధీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని చెప్పింది. ఏమీ లేకపోయినా, అంతా తానే చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ… ఎన్నికల ఫలితాల ముందే విపక్షాల సమావేశం ఏర్పాటు చేసే ప్రతిపాదన చంద్రబాబు నాయుడే తెచ్చారని రాసింది. ఒకవేళ ఈ సమావేశం జరిగితే… రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషించింది. రాహుల్ కి మద్దతుగా ఈ సమావేశం ఉంటుందన్న అనుమానాలు ఉండటంతోనే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటివారు భేటీ వద్దన్నారని సాక్షి చెప్పింది. చివరి ప్రయత్నంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా… ప్రయోజనం ఉండదని తేల్చేసింది! ఏపీలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు కాబట్టే ఈ ప్రయత్నాలని సాక్షి తీర్మానించేసింది.
చంద్రబాబు ప్రయత్నాన్ని కాసేపు పక్కనపెడదాం. గెలుస్తామన్న ధీమా ఉన్న వైకాపా… జాతీయ రాజకీయాల్లో ఎటువైపు ఉంటుంది? ఇప్పుడీ చర్చ అవసరమా అంటే… కచ్చితంగా అవసరమే. ఎందుకంటే, ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ కేటాయింపులూ విభజన హామీలూ ప్రత్యేక హోదా ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి, ఏపీలో అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉన్న ఏ పార్టీ అయినా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర కోసం ప్రయత్నించాలి. ఏదో ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి. ఆంధ్రాలో విజయం తమదే అని చెప్పుకునే వైకాపా… ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు..? భాజపా తీరుపై విమర్శలు చేసిన వైకాపా నేతలు, ఇప్పుడు కూడా మౌనంగా ఉంటూ ఎవరి తరఫున నిలుస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు..? చంద్రబాబు చేసే ప్రయత్నాన్ని విమర్శలు చేసే కంటే… రాష్ట్ర ప్రయోజనాల సాధన కోణం నుంచి ఎందుకు చూడలేకపోతున్నారు..? అదే తరహాలో జగన్ కూడా ప్రయత్నాలు చెయ్యొచ్చు. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడితేనే ఏపీకి మేలు జరుగుతుందనేది స్పష్టం. ఈ విషయంలో వైకాపా వైఖరి ఏంటి..?