ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనివార్య పరిస్థితుల్లో అనుసరించాల్సి వస్తున్న రాజకీయ విధానంతో ఆయన యాజమాన్యంలోని పత్రిక సాక్షికి ఎక్కడ లేని తిప్పలు వచ్చి పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు.. అటు కాంగ్రెస్‌తో లింక్ పెట్టాలా.. ఇటు బీజేపీతో సంబంధాలు అంటగట్టాలా అన్న క్లారిటీ రాలేక.. మూడు నాలుగు రోజులుగా గందరగోళ కథనాలు రాశారు. బ్యానర్లో టీడీపీతో బీజేపీ సంబధాలు కొనసాగిస్తోందని.. బాటమ్‌లో కాంగ్రెస్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని రాయాల్సి వచ్చింది. పాఠకులు నమ్ముతారో లేదో తర్వాతి సంగతి ముందు …తమ అధినేతను మాత్రం సంతృప్తి పరచాలని ఎడిటోరియల్ సిబ్బంది తాపత్రయ పడినట్లు కథనాల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
టీడీపీపై … రాజకీయ వ్యూహాన్ని సాక్షి ద్వారా అమలు చేస్తూ తేలిపోతున్నారు. మరి .. సొంత ఎజెండాను అయినా బలంగా చెప్పుకోలగలిగారా ..అంటే… అదీ లేదు. కేంద్ర ప్రభుత్వం పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సులను తనకు అనుగుణంగా, కావాల్సిన రీతిలో అర్థం చేసుకున్నట్లుగా జగన్ మాటలను… అర్థం చేసుకుని… ప్రజల్లో జగన్ ఇమేజ్ను పెంచేలా కథనాలు రాస్తున్నారు. అవిశ్వాస పరిణామాలపై కాకినాడలో ప్రెస్‌మీట్ పెట్టిన జగన్..ప్రత్యేకహోదా సాధించడానికి ఎంపీలతో రాజీనామాలు చేయించాలనే ఎకైక ఎజెండాతో ముందుకెళ్తానని ప్రకటించారు. ఆయన తన ఎటాక్ అంతా చంద్రబాబుపై పెట్టారు కానీ.. ఎక్కడా.. బీజేపీని, మోడీని పల్లెత్తు మాట అనలేదు. కానీ ఆయన అన్నట్లుగా అర్థం చేసుకుని…అక్కడక్కడా చంద్రబాబుతో పాటు… బీజేపీ పేరును కూడా ముందో… వెనుకో చేర్చి… కథనం రాసేసుకుని పాఠకులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.
అవిశ్వాసంపై పార్లమెంట్లో మోడీ ప్రసంగంలో “ప్రత్యేకహోదా వద్దు…ప్యాకేజీనే కావాలి” అని చంద్రబాబు అన్నట్లుగా..శనివారం దినపత్రికలో సబ్ హెడ్ లైన్ పెట్టి మరీ ప్రచురించారు. ఆ మాట ప్రధాని అనలేదు. వైసీపీ నేతల వాదన అది. కానీ నమ్మించడానికి అలా రాసేసుకున్నారు. ఇదే కాదు.. జగన్ స్పీచ్‌ని .. ప్రకటనలను కూడా … ప్రజలకు ఓ రకంగా… తమకు కావాల్సిన వారికి మరో రకంగా అర్థమయ్యేలా కథనాలు ప్రచురిస్తున్నారు. ఈ అంశాల్లో బీజేపీ, మోడీ అంటే ఉన్న భయం… వీటిలో స్పష్టంగా అవగతమవుతూనే ఉంటుంది.
సాక్షి పత్రికలో జర్నలిజం ప్రమాణాలను వెతకడం అంటే… గొంగట్లో తింటూ… వెంట్రుకలేరుకున్నట్లేనన్న అభిప్రాయం… గత వారం రోజుల పరిణామాల్లో మరోసారి ఆ పత్రిక నిరూపించింది. రాజకీయ పార్టీగా వైసీపీ బలంగా ఉంది.. ఆ పార్టీని అభిమానించేవారు పత్రిక కొనుక్కుంటారు కదా… అది సరిపోతుందనుకుంటే… ఇప్పటికే పడిపోతున్న సర్క్యూలేషన్‌ను ఆపడం ఎవరి తరం కాదు. స్ట్రింగర్లకు, రిపోర్టర్లకు సర్క్యులేషన్ పెంచానే టార్గెట్లు పెడితే కాదు.. పత్రిక బాగుపడేది..!జర్నలిజాన్ని .. జర్నలిజంలా భావించాలి. లేకపోతే.. ఈ పతనం ఎందాకో… చిట్టచివరికి చేరిన తర్వాతే తెలుస్తుంది.,