ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లాలో నడుస్తున్నారు. అయితే, జగన్ యాత్ర ఎక్కడకి వెళ్లినా… సాక్షిలో కవరేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే! ప్రజలందరూ జగన్ దగ్గరకి వచ్చి సమస్యలు మొరపెట్టుకున్నారనీ, జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప కష్టాలు తీరవని అంటున్నారనీ, పంటలు పండటం లేదనీ, యువతకు ఉపాధి లేదనీ, ‘అన్నా నువ్వే దిక్కు’ అంటూ ప్రజలు వాపోతున్నారంటూ… దాదాపు ఇదే తరహాలో సాక్షి కవరేజ్ ఉంటూ వస్తుంది. ప్రజలను ఎప్పుడూ ఒక దీనావస్థ నుంచే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు విజయనగరం జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా కూడా ఇలాంటి కవరేజే ఇచ్చారు. అయితే, ఈ క్రమంలో వాస్తవాలను కప్పిపుచ్చలేకపోతోంది సాక్షి!
‘పరిశ్రమలకు ఇది గడ్డు కాలమన్నా’ అంటూ ప్రజల యాంగిల్ నుంచి నేటి సాక్షిలో ఓ కథనం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పరిశ్రమలు మూతపడుతున్నాయనీ, పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోతున్నామంటూ విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది జగన్ దగ్గరకి వచ్చి మొరపెట్టుకున్నారని రాశారు. జిల్లాలోని జూట్ మిల్లులు సమస్యల్లో ఉన్నాయనీ, వీటిని కాపాడుకోవడం కోసం గత ముఖ్యమంత్రి దివంగత వైయస్సార్ కృషి చేశారని చెప్పారని రాశారు. జగన్ నడుచుకుని వస్తుంటే… ‘రాజన్న బిడ్డను చూసి పల్లెవాసులు పులకించిపోయారు. అభిమాన నాయకుడి వెంట అడుగులు వేశారు. పొలాల్లో పనులున్నవారు, పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు జననేతకి ఎదురేగి సమస్యలు మొరపెట్టుకున్నారు’ అంటూ ఓ కథనంలో పేర్కొన్నారు.
ఆ కథనం ప్రకారమే… జగన్ వస్తుంటే జనం ఎక్కడ్నుంచి పరుగులు తీస్తూ వచ్చారూ… పొలాల్లోంచి, పరిశ్రమల్లోంచి కదా! అంటే, పొలాల్లో పని ఉంటోంది, పరిశ్రమల్లో పని ఉంటోందని సాక్షి చెప్పకనే చెబుతోంది కదా! ఇంకోటి… జగన్ రాకను ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో, సంబరంగా జగన్ ను ఆహ్వానించి పులకించిపోతున్నారన్నారు. ఒకవేళ, ప్రజల జీవితమంతా కష్టాలతో నిండి ఉంటే, సమస్యల్లో చిక్కుకుని ఉంటే జగన్ ఆహ్వానించేటప్పుడు కన్నీటి పర్యంతం అవుతూ ఆవేదనతో స్వాగతిస్తారుగానీ… ఇంత సంబరంగా ఎందుకుంటారు..? ఇంట్లో పరిస్థితి బాలేదనుకున్నప్పుడు, సమస్యలున్నాయనుకున్నప్పుడు సగటు మనిషి ఎవ్వడూ సంబరాలు చేసుకోలేడు. తమ సమస్యల్ని తీర్చే నాయకుడు వచ్చాడని అనిపించినప్పుడు.. ఆ క్షణం ఉండే ఎమోషన్ ఆనందం కాదు. పోనీ, జగన్ కోసం ఆశగా చూశారని రాస్తే కొంత అర్థం ఉంటుంది. కానీ, ‘ఆనందంగా ఎదురుచూడ్డం’ అనడంలోనే వారి జీవితాల్లోని సంతృప్తిని ‘సాక్షి’ చెప్పకనే చెబుతున్నట్టు..!
ప్రజల కోణం నుంచి రాసేటప్పుడు ఇలానే వాస్తవ పరిస్థితి తెలియకుండానే చెప్పేస్తున్నట్టు అవుతోంది. సమస్యల్లో ప్రజలు ఉన్నారనుకున్నప్పుడు… ఆ సమస్యలున్న గ్రామాలు ఎలా ఉంటాయి, ఉంటే వాటి మధ్యలో ప్రజలు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటారనే స్క్రిప్ట్ వర్క్ అయినా సరిగ్గా చేసుకోవాలి కదా! ఆ మూడ్ కి తగ్గట్టుగా వాతావరణాన్ని చెప్పుకుంటూ రావాలి. ప్రజలకు పత్రిక ద్వారా ఇదే చూపించాలని అనుకున్నప్పుడు… దానికి తగ్గట్టుగా పకడ్బందీగా రాతలు ఉండాలి కదా..?