ఆ మధ్య విడుదలైన అల వైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హర్షవర్ధన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ మనం నీతిగా నిజాయితీగా ఉండాలి అని చెబుతూ ఉంటే అది చూసిన అల్లు అర్జున్, ” మనం అస్సలు పాటించని అంశాలను కూడా అవతలి వాళ్లకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు చూశారూ, మీరు సూపర్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్, అంతే” అంటూ సెటైర్ వేస్తాడు. ఈ డైలాగ్ సినిమాలో సూపర్ హిట్ కావడమే కాకుండా, తెలుగు వారి వాడుక భాషలోకి సులభంగా చేరిపోయింది. ఇప్పుడు తాజాగా సాక్షి ఛానల్ చూస్తున్న వారు ఇదే డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
శనివారం ఉదయం చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేసిన సమయం నుండి సాక్షి ఛానల్, జడ్జి గారి కంటి ముందే చంద్రబాబుపై తీర్పులు ఇచ్చేసింది. స్కాంస్టర్ అరెస్ట్ అంటూ పలు కథనాలను సాక్షి వండివార్చింది. అక్కడ వరకు పరవాలేదు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలు ఒక పార్టీకి మరికొన్ని పత్రికలు మరొక పార్టీకి వంతపడుతూ కథనాలు చేయడం కొత్తేమీ అయితే అసలైన కామెడీ ఎక్కడ మొదలైంది అంటే, స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి వివరిస్తూ, ఇందులోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి అక్కడి నుండి షెల్ కంపెనీలలోకి చంద్రబాబు ఎలా డబ్బులు మళ్ళించాడు అంటూ గ్రాఫిక్స్ చేసి , ఫ్లో చార్టును గీసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది సాక్షి ఛానల్. ఈ సందర్భంగా ఆ ఛానల్ యాంకర్స్ మాట్లాడుతూ, అసలు ఇలా షెల్ కంపెనీలు పెట్టడం, వాటిల్లోకి డబ్బులు మళ్ళించడం ఎంత ఘోరమైన నేరమో అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కథనాన్ని రక్తి కట్టించారు.
అసలు తెలుగు ప్రజలకు షెల్ కంపెనీల గురించి, వాటిల్లోకి డబ్బులు మళ్ళించడం గురించి తెలిసిందే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సమయంలో. ఇప్పుడు అదే జగన్ కి చెందిన సాక్షి ఛానల్ షెల్ కంపెనీల గురించి, వాటిల్లోకి డబ్బులు మళ్ళించే ప్రాసెస్ గురించి విశదీకరించే సాక్షి కథనాన్ని చూసిన వారంతా నిజంగా సాక్షి ఛానల్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటూ అలా వైకుంఠపురం స్టైల్ లో అభిప్రాయపడుతున్నారు.