వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక .. ఇప్పుడు విశ్వరూపం చూపించే ప్రయత్నాల్లో ఉంది. గత పదేళ్లుగా.. వైఎస్ జగన్కు వ్యతిరేక పార్టీలపై… కావాల్సినంత… వ్యతిరేక ప్రచారం చేసినా.. ఇప్పుడు మిషన్ మారింది. ఓ వైపు జగన్ సీఎం గా ఉన్నారు.. మరో వైపు.. నిన్నమొన్ననే అధికారం కోల్పోయిన పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ చేసిన పనులన్నింటినీ… అసలు జరగలేదని చెప్పి.. ఇప్పుడు జగన్ వచ్చి.. చిటికెలో వాటినన్నింటినీ… సర్దేశాడని చెప్పడానికి.. అసలైన విశ్వరూపం చూపించబోతోంది. అందులో భాగంగా.. ఈ రోజు మిషన్ పోలవరం ప్రాజెక్ట్ ను ఎత్తుకుంది. ఆ ప్రాజెక్ట్ ఇంకాపునాదుల్లోనే ఉందని తేల్చేస్తూ.. కథనం రాసి పడేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో.. పోలవరం ప్రాజెక్ట్ ఇంకాపునాదుల్లోనే ఉందని చెప్పేవారు. నిజానికి ఆయన ఐదేళ్ల కాలంలో.. ఎప్పుడూ పోలవరం ప్రాజెక్ట్ ను చూడలేదు. పాదయాత్ర.. గోదావరి జిల్లాలకు వచ్చినా ఆయన అటు వైపు వెళ్లలేదు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేసినా డోంట్ కేర్ అన్నారు. ఇప్పుడు సీఎం హోదాలో.. తొలి సారి పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నారు. అందుకే సాక్షి పత్రిక గ్రౌండ్ వర్క్ చేసింది. పునాదులు కూడా.. పడలేదని.. తీర్మానించి కథనం రాశారు. 70 శాతం పూర్తయిందని.. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని.. కానీ అక్కడ పునాదులే లేవన్న అర్థంలో ప్రచారం ప్రారంభించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు పోలవరం పర్యటన తర్వాత… ఆయన ఇచ్చే ఆదేశాలతో.. పోలవరం ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆయన అడుగు పెట్టగానే.. ప్రాజెక్ట్ కు ఓ రూపం వస్తుంది. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో.. ఆ ప్రాజెక్ట్ను నాశనం చేస్తే.. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజులోనే.. దాన్ని సరిదిద్ది వస్తారు. ఇప్పటికే.. ప్రమాణస్వీకారం చేయక ముందే ఢిల్లీకి వెళ్లి… పోలవరానికి కావాల్సిన అన్ని అనుమతుల కోసం ప్రయత్నించి వచ్చారు. ఇక నుంచి పనులు పరుగులు పెట్టబోతున్నాయని.. సాక్షి చెబుతోంది. నిన్నటిదాకా పునాదుల్లో ఉన్న పనులు.. ఈ రోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని.. 70 శాతానికి చేరుకునే అవకాశం ఉందని.. సాక్షి నేరుగా చెబుతోందన్నమాట. ఎంతైనా.. సాక్షి మార్క్ జర్నలిజాన్ని… ఎవరూ అంచనా వేయలేరు.